ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టులపై అనవసరమయిన కుట్రలు, రాజకీయాలు చేసి నిద్రపోతున్న పులిని లేపొద్దని హెచ్చరించారు. మీరు ఇటుకతో కొడితే మేము రాళ్ళూ పెట్టి కొడతామని తీవ్రంగా హెచ్చరించారు. కృష్ణా, గోదావరి నదీ జలాలలో తెలంగాణా రాష్ట్రానికి న్యాయంగా ఉన్న వాటా నీళ్ళని వాడుకొనేందుకు ప్రాజెక్టులు కట్టుకొంటే మామీద పడి ఎందుకు ఏడుస్తారు? అని ప్రశ్నించారు. తెలంగాణా ప్రాజెక్టులపై అనవసరమయిన ఆరోపణలు చేస్తూ ఆంధ్రా నేతలు పరువు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కడుపులో కత్తులు దాచుకొని నోట్లో బెల్లం ముక్క పెట్టుకొని కపటంగా మాట్లాడుతారని కేసీఆర్ ఇద్దరిని విమర్శంచారు. ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోదలిస్తే చేసుకోండి కానీ మాజోలికి వస్తే కబడ్ధార్! అని హెచ్చరించారు.
చంద్రబాబు, జగన్ లపై కేసీఆర్ నిప్పులు ఈవిధంగా చెరుగుతుంటే, తెలంగాణా నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి స్వయంగా ఫోన్ చేసి నీటి సమస్యలను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకొందామని చెప్పడం విశేషం. అందుకు దేవినేని కూడా సానుకూలంగా స్పందించి, అన్ని సమస్యలను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి సమక్షంలో పరిష్కరించుకొందామని సూచించారు.
ఈవిధంగా ఇరు పక్షాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా ఒకరినొకరు రెచ్చగొట్టుకొనే విధంగా సవాళ్లు విసురుకోవడం చాలా శోచనీయం.