తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. రెండో సారి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఇంత వరకూ కీలకమైన హామీలను అమలు చేయలేదు. రుణమాఫీ నుంచి… నిరుద్యోగ భృతి వరకూ చాలా హామీలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని అమలు చేయకపోతే ప్రజల్లో అసంతృప్తి అంతకంతకూ పెరిగిపోతుందన్న ఆందోళనతో ఉన్న కేసీఆర్.. హామీలను అమలు చేసే ప్రక్రియ ప్రారంభించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కరోనా వైరస్ వల్ల రుణమాఫీ ఆలస్యమైందని సంజాయిషీ ఇచ్చుకున్నారు.
మరో వైపు.. గతంలో ప్రభుత్వానికి బాగా ఓట్లు తెచ్చి పెట్టిన పథకాల్లో ఒకటి.. గొర్రెల పంపిణీ. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం… డిపాజిట్లు తీసుకున్న అధికారులు.. చాలా కాలంగా పట్టించుకోవడం లేదు. ఒకటి.. రెండు సార్లు.. లబ్దిదారులు ప్రగతి భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ పథకం అమలు సరిగ్గా లేకపోవడంతో గొల్ల కురుమలు అసంతృప్తితో ఉన్నారని అంనచా వేసిన కేసీఆర్… పథకం అమలుపై దృష్టి పెట్టారు. ఈ పథకం కూడా కరోనా వల్ల నిలిచిపోయిందని.. వెంటనే గొర్రెల పంపిణీని పూర్తి చేయాలని ఆదేశించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 75 శాతం రాయితీ రెండో విడత గొర్రెల పంపిణీని చేపట్టాలన్నారు. ఇప్పటికే.. ఉద్యోగులకు పీఆర్సీ సహా అనేక తాయిలాలు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీని ప్రకటించారు. పథకాలనూ అమలు చేయడానికి సంకల్పించారు. అయితే.. ఇవన్నీ ప్రకటనలకే పరిమితమైతే.. ప్రజల్లో మరింత అసంతృప్తి పెరిగిపోతుంది. అందుకే కేసీఆర్.. అన్నింటినీ పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నారు.