తెలంగాణలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అందరూ ఏకగ్రీవం అవుతారు. అన్ని స్థానాలకు టీఆర్ఎస్కే వస్తాయి. కానీ ఆశావహులు మాత్రం అరవై మందికిపైగా ఉన్నారు. ఎవరికి ఇస్తే.. ఎవరు అసంతృప్తికి గురవుతారో తెలియని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, వివిధ పార్టీలకు చెందిన నేతలు చేరిక సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని, మంచి పదవులు ఇస్తానని హామీలు ఇచ్చారు. వారితో ఇతర సీనయర్లూ చాన్స్ కోసం చూస్తున్నారు.
పదవీ కాలం పూర్తయిన ఆరుగురు కూడా టీఆర్ఎస్ సభ్యులే. సహజంగానే వీరంతా రెన్యూవల్ కోసం చూస్తున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరిలకు దాదాపుగా ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇతర పార్టీల్లో ఎమ్మెల్సీలుగా ఉండి టీఆర్ఎస్లో చేరి ఆ తర్వాత ఓ టర్మ్ ఎమ్మెల్సీ పదవి పొందిన వారినిఈ సారి పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బొడకుంటి వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్, ఫరీదుద్దీన్, ఆకుల లలితకు ఈ సారి మొండి చేయి ఖాయమని చెబుతుననారు.
ఇక రేసులో అన్ని జిల్లాలనుంచి సీనియర్లు ఉన్నారు. ఓడిపోయిన టిక్కెట్లు అందని నేతలు తీగల కృష్ణారెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, ఎల్బీ నగర్ రామ్మోహన్ గౌడ్, బండి రమేష్, బొంతు రాంమ్మోహన్ , మధుసూదనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఇటీవల హుజూర్ నగర్ టిక్కెట్ ఆశించి భంగపడిన కోటిరెడ్డి, కర్నె ప్రభాకర్, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ, ఇనుగాల పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు వంటి వారందరూ రేసులో ఉన్నారు.
వీరు కాక ఉద్యమం కాలం నుంచి కేసీఆర్ వెంట ఉండి పదవుల కోసంఎదుర ుచూస్తున్న గాయకుడు దేశపతి శ్రీనివాస్, గ్యాదరి బాలమల్లు వంటి వారు కూడా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టంగా మారింది. ఆ ఎన్నికల్లో ఫలితం తేడా వస్తే… ఒత్తిడి మరింత పెరుగుతుంది. నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూసినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. తమకు ఇవ్వకపోతే అదే జరుగుతుందని ఇప్పటికే కొంత మంది సంకేతాలు పంపుతున్నారు.