తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమయిన విషయం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు క్రింద ఖమ్మం జిల్లాలో ముంపుకు గురయ్యే నాలుగయిదు గ్రామాలను మళ్ళీ తెలంగాణాకి వాపసు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారని చెప్పారు.
తెలంగాణాలో ఉన్న ఆ గ్రామాలు ముంపుకు గురయితే ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందనే ఉద్దేశ్యంతో దానిని నివారించడానికే ఆ గ్రామాలను కేంద్రప్రభుత్వం ఆంధ్రాలో విలీనం చేసింది. ఇప్పుడు ఆ గ్రామాలను తిరిగి తెలంగాణాకు వాపసు చేయడానికి చంద్రబాబు నాయుడు అంగీకరించారని కేసీఆర్ చెపుతున్నారు. అంటే దానర్ధం పోలవరం ప్రాజెక్టుని నిర్మించబోవడంలేదనేమో? ఒకవేళ నిర్మించే మాటయితే ముంపుకు గురయ్యే ఆ గ్రామాలను తెలంగాణాకు ఇవ్వవలసినవసరం ఉండదు. ఇచ్చినా ప్రయోజనం ఉండదు.
చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు మొదట్లో పోలవరం ప్రాజెక్టుని ఐదేళ్ళలో నిర్మిస్తామని గట్టిగా చెపుతూ ఉండేవారు. ఆ తరువాత ఏడేళ్ళన్నారు. ఇప్పుడు ముంపు గ్రామాలను తెలంగాణాకి వాపసు ఇచ్చేస్తామని చెపుతున్నారు కనుక ఇక ఆ ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచన లేనట్లే కనబడుతోంది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ఈ విషయంపై చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. లేకుంటే పోలవరం ప్రాజెక్టు హామీని కూడా అటకెక్కించినట్లే అనుమానించవలసి వస్తుంది.