తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో… ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే, బంగారు తెలంగాణ అవుతుందన్నారు. అదే నా కల అన్నారు. రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక జూస్కోండి తెలంగాణ రాష్ట్రం ఎట్ల ఎదుగుతదో అన్నారు. ఐదేళ్లు అయిపోయాయి. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక మరో ఏడాది కూడా గడిచిపోయింది. ఇప్పుడూ కేసీఆర్ అదే తరహాలో మాట్లాడుతున్నారు. మరో ఆర్నెలలో అద్భుతాలు జరుగుతాయనీ, రాబోయే రోజులు బంగామని భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి కనీసం ఐదేళ్ల విజన్ ఉండటం తప్పులేదు. కాకపోతే, గడచిన ఐదేళ్లు ఉన్నాయి కదా… ఆ సమయంలో ఏం జరిగిందనే చర్చ కూడా ఉండాలి కదా! ఆ వైపు ప్రజల ఆలోచనల్ని, ప్రతిపక్షాల వాదనల్ని మళ్లకుండా అడ్డుకట్ట వేయడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు అనడంలో సందేహం లేదు.
సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించిన సీఎం ఏమన్నారంటే… ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే అద్భుతం జరుగుతుందని తాను గతంలో చెప్పాననీ, మరో ఆర్నెల్లు దాటితే అదే జరుగుతుందన్నారు. నేను కలగన్న తెలగాణ కనవడ్తది, ఆ సన్నాసులకు (భాజపా, కాంగ్రెస్) కూడా దీన్ని చూపిస్తం అన్నారు. పాపికొండలు దగ్గర గోదావరి ఎలా కనిపిస్తుందో, సిరిసిల్ల కొండల్లో కూడా అలాంటి దృశ్యమే కనిపిస్తుందన్నారు. నేను కళ్లారా చూసిన, గంగమ్మకు పూజ చేసిన, ఏ తెలంగాణ గురించైతే కలగన్నానో, కేసీఆర్ గా ఇప్పుడు అదే తెలంగాణను ఇప్పుడు చూడగలుగుతున్నా. అదేంటో రెండేళ్లలో సాకారమౌతుందన్నారు. ఈ బీజేపీ, కాంగ్రెస్సోళ్లకి ఏ నాలెడ్జీ లేదనీ, కాళేశ్వరం గురించి ఏమీ తెలీదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారనీ, ఇప్పుడు మిడ్ మానేరు మీద కేసులు పెడుతున్నారన్నారు.
ఈ పర్యటనలో కేసీఆర్ చేసిన మాజిక్ ఏంటంటే… గడచిన ఆరేళ్ల పాలనలో సాధించిన విజయాల ప్రస్థావన జోలికి వెళ్లనీయలేదు! ఇతర రంగాల్లో పురోగతి గురించి మాట్లాడలేదు. సన్నాసులూ దద్దమ్మలూ అంటూ ప్రతిపక్షాలను విమర్శించారు. మరో ఆర్నెల్లు, ఇంకో రెండేళ్లు అంటూ భవిష్యత్తువైపు చూపించారు. తనేదో కలగన్నాననీ, తనొక్కడికే ఇప్పుడది కనిపిస్తోందన్నారు. విజయాల గురించి చర్చించేంత వయస్సు తెరాస ప్రభుత్వానికి ఇప్పుడుంది. రంగాలవారీగా సాధించిన అభివృద్ధి గురించి తెలుసుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్న సమయం ఇది. ఆ దిశగా మాట్లాడే ప్రయత్నం కేసీఆర్ చెయ్యరు! ఇంకా కలల గురించి మాట్లాడే సమయమా ఇది?