తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఇందిరాపార్క్‌లో ధర్నా చేయబోతున్నారు. ధర్నా చౌక్ ను ఎత్తేసిన కేసీఆర్ అక్కడ ధర్నా చేయడానికి సిద్ధపడటం..రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయని… దానికి ఎంతో కాలం పట్టదని నిరూపించేలా ఉంది. ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన ధర్నా చేయాల్సి వస్తోంది. ఈ ధర్నా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని.. కేంద్రం తెలంగాణ రైతుల్ని మోసం చేస్తుందని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనేది ఆయన ఆలోచన. అందులో ఎంత వరకూ నిజం ఉందో కానీ.. కేంద్రంతో పాటు వరి విషయంలో రాష్ట్రానికీ బాధ్యత ఉంది.
కేసీఆర్ నిన్నే ప్రధానమంత్రికి లేఖ రాశారు. వచ్చే యాసంగి పంటను ఎంత కొంటారో చెప్పాలని కోరారు. కానీ ఇప్పుడు రైతుల సమస్య యాసంగి పంట కాదు. కానీ కేసీఆర్ యాసంగి పంట సమస్యను చూపిస్తున్నారు. అసలు సమస్య ప్రస్తుతం రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం. యాసంగిలో వరి వేయవద్దని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పుడు చేతికొచ్చిన పంటను మాత్రం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పంటను కొంటాం అని చెబుతుంది. కానీ రోజుల తరబడి రైతులు ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లు, కొనుగోలు కేంద్రాల వద్దే ఉంచుతున్నారు. తేమ ఉందని, టోకెన్లు ఇచ్చాం ఇంకా మీ టైం రాలేదని అధికారులు చెబుతున్నారు.
అయితే ఈ కొనుగోళ్లు కూడా కేంద్రమే చేయడం లేదని కేసీఆర్ చెప్పాలని తాపత్రయ పడుతున్నారు. దీన్ని రైతుల్లోకి తీసుకెళ్లేందుకు బండి సంజయ్ పర్యటనలు ప్రారంభించారు. కానీ ఆయనపై దాడులు చేయడంతో వివాదం ప్రారంభమయింది. టీఆర్ఎస్ మాత్రం దాడి చేస్తోంది రైతులేనని చెబుతోంది. తరైతుల వద్ద కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లు ఉంటాయా? అనేది ప్రశ్న. మరోవైపు ఈ దాడి – ప్రతి దాడులకు కొనసాగింపుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
రైతులు కేంద్రాన్ని ఎక్కువగా లెక్కలోకి తీసుకోవడం లేదు. కేవలం కేసీఆరే తమ ధాన్యాన్ని కొనాలని అనుకుంటున్నారు. దానికి గతంలో ఆయన చేసిన ప్రకటనలే కారణమవుతున్నాయి. ఇప్పడు కేంద్రానికి వ్యతిరేకంగా ఆయన ధర్నాలు చేయడం వ్యూహాత్మక తప్పిదాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతంలోకేజ్రీవాల్ కూడా సీఎంగా ఉండి.. ధర్నాలు చేశారు.కానీ తర్వాత లెంపలేసుకున్నారు. అలాంటి పరిస్థితి కేసీఆర్‌కు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్న అభిప్రాయం అందుకే వినిపిస్తోంది.