తెలంగాణ భవన్ లో పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ప్రారంభమే కొంతమంది ఎమ్మెల్యేలకు క్లాస్ పీకడంతో మొదలైంది. సమావేశానికి ఆలస్యంగా కొంతమంది రావడంతో, సీఎం కాస్త అసంతృప్తికి గురయ్యారు. ముందురోజు సాయంత్రమే అందర్నీ హైదరాబాద్ చేరుకోవాలంటూ ఆదేశించినా.. కొంతమంది ఆలస్యంగా రావడం సీఎం అసహనానికి కారణమైంది. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు వారి పరిధిలోని మున్సిపాలిటీల్లో ఎవరికి టిక్కెట్లు ఇవ్వబోతున్నారు, ఎవరిని ఛైర్మన్లుగా ప్రతిపాదిస్తున్నారు అనేది ఖరారు చేసి తెచ్చిన జాబితాలను సీఎంకి ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకి ఎ, బి ఫారమ్స్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారు. అనంతరం మాట్లాడుతూ… తెరాసకు రాష్ట్రమంతా అనుకూలంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపును ఎమ్మెల్యేలంతా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
ప్రధానంగా రెబెల్స్ గురించి ఎక్కువసేపు సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. పార్టీ నుంచి టిక్కెట్లు ఆశిస్తున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి, రెబెల్స్ బెడద ఉంటుందని సీఎం అన్నారు. మరో నాలుగేళ్లపాటు తెలంగాణలో తెరాస అధికారంలో ఉంటుంది కాబట్టి, ఇతర పదవులు లేదా ఇతర అంశాల విషయంలో పార్టీ నుంచి ఏదో ఒక రకమైన మేలు కచ్చితంగా జరుగుతుందని వారికి హామీ ఇచ్చి బుజ్జగించాలంటూ ఎమ్మెల్యేలకు సీఎం సూచించినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఎన్నికలు లేకపోయినా పార్టీ పదవులు చాలా ఉంటాయని చెప్పాలన్నారు. ఇది తన మాటగా రెబెల్స్ కి చెప్పి పోటీని విమరమింపజేయాలని ఎమ్మెల్యేలకు సీఎం చెప్పారు. ఒకవేళ అప్పటికీ వినకుంటే… అలాంటివారిని పార్టీ నుంచి వేటు వెయ్యాలని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సందర్భంలో వేటుపడ్డవారిని భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తెరాసలోకి తీసుకునే అవకాశం ఉండదనేది కూడా స్పష్టంగా తెలియజేయాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం.
తెరాసకి మున్సిపోల్స్ లో రెబెల్స్ బెడద తీవ్రంగానే ఉందనేది ముఖ్యమంత్రి మాటల్లో అర్థమౌతోంది. రెబెల్స్ ఇతర పార్టీలవైపునకు వెళ్లే ఆలోచన చేయకుండా కట్టడి చేయాలనే వ్యూహం కనిపిస్తోంది. బుజ్జగించాలి, లేదంటే భవిష్యత్తుపై భయం కలిగించేలా హెచ్చరిస్తూ బహిష్కరించాలని భావిస్తున్నారు. అయితే, ఇప్పటికే తమ నియోజక వర్గాల్లో చాలావరకూ రెబెల్స్ ని బుజ్జగించేశామని, రాబోయే రెండు మూడు రోజుల్లో ఆ చర్చే ఉండదని కొంతమంది ఎమ్మెల్యేలు సమావేశం అనంతరం మీడియాతో చెప్పారు. చూడాలి.. సీఎం ఆదేశాలు ఏరకంగా పనిచేస్తాయో?