ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులతో చర్చల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత మెత్తబడ్డట్టుగానే కనిపిస్తోంది. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. త్వరలో కోర్టుకు వినిపించాల్సిన వాదనలతోపాటు, సమ్మెను ఆపేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి పువ్వాడ అజయ్, అధికారులతో చర్చించారు. ఆర్టీసీ కార్మికులను శనివారం చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. చర్చల ప్రసక్తే లేదనీ, ఆర్టీసీ మునిగిపోవడమే సమ్మెకు ముగింపు అన్నట్టుగా ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాస్త మనసు మార్చుకున్నట్టుగా ఉన్నారు. అయితే, ఆర్టీసీ సమ్మె విషయంలో ద్విముఖం సీఎం కేసీఆర్ అవలంభిస్తున్నారని అనిపిస్తోంది. ఓపక్క చర్చలకు పిలుస్తూనే… తెర వెనక మరో వ్యూహం కూడా అమల్లోకి తెచ్చినట్టు సమాచారం!
కొంతమంది ఎమ్మెల్యేలకు సమ్మె నిర్మూలన బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది! ఎలా అంటే… కార్మిక సంఘాల నాయకులు, కార్మికులతో సాన్నిహిత్యం ఉన్న ఎమ్మెల్యేలు… నేరుగా వారితో మాట్లాడాలనీ, మొన్న ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు సమ్మెని విడిచి పెట్టిని, విధుల్లో చేరేందుకు కార్మికుల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలని మౌఖికంగా ఆదేశించినట్టు సమాచారం. విధుల్లోకి చేరాలనుకునేవారు… సమ్మెను విరమిస్తున్నట్టు లిఖితపూర్వకంగా రాసిస్తేనే చేర్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే కూకట్ పల్లి డిపోలో రాజు అనే ఉద్యోగి… 21 రోజుల సమ్మె తరువాత ప్రప్రథమంగా ముందుకొచ్చి, డిపో మేనేజర్ కి లేఖ ఇచ్చి విధుల్లో చేరారు. అసలు ట్విస్ట్ ఏంటంటే… అశ్వత్థామ రెడ్డి మీద కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఈ రాజు ఫిర్యాదు చేయడం! అశ్వత్థామ లాంటి నేతల వల్లనే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేయడం విశేషం. ఒక్క కూకట్ పల్లిలోనే కాదు… రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఫిర్యాదులూ, కార్మికులను విధులకు హాజరయ్యేట్టు చేయడం వంటి ప్రయత్నాలు ద్వారా సమ్మెను విరమింపజేయాలనే వ్యూహం తెర వెనక ఉందని తెలుస్తోంది.
చర్చల్లేవ్ అంటూ తేల్చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మెత్తబడ్డట్టు వ్యవహరిస్తున్నారంటే…. సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్ని కోర్టుకు వివరించాల్సిన అవసరం ఉంటుంది. మేం చర్చలకు పిలిచాం, వాళ్లు మొండికేశారు అనైనా చెప్పుకోవచ్చు కదా! మరోవైపు, కార్మికుల విధుల్లో చేరేలా ప్రోత్సహించడంతోపాటు, సంఘాల నాయకులూ కార్మికుల మధ్య దూరాన్ని పెంచే ప్రయత్నమూ జరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది! సమ్మె ప్రారంభమైన తొలిరోజుల్లోనే… తమ ఐక్యతను దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. మొత్తానికి, ద్విముఖ వ్యూహంతో ఇప్పుడు ఆర్టీసీ సమస్యను డీల్ చేసేందుకు సీఎం సిద్ధమౌతున్నట్టుగా కనిపిస్తోంది.