కొత్త రెవెన్యూ చట్టం తేవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమైపోయారు. గవర్నర్ తో భేటీ సందర్భంగా ఈ అంశంపై కీలక చర్చ జరిగినట్టు సమాచారం. త్వరలోనే అమల్లోకి తేవాలనుకుంటున్న కొత్త చట్టం గురించి సీఎం వివరించినట్టు తెలుస్తోంది. ఈ చట్టాన్ని ఆమోదింపజేసుకోవడం కోసం డిసెంబర్ నెలలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయనీ, కాబట్టి ఆ శాఖ సమూల ప్రక్షాళన తప్పదని గవర్నర్ కి ముఖ్యమంత్రి వివరించినట్టు సమాచారం.
రెవెన్యూ శాఖ సమూల ప్రక్షాళన అనగానే… ఆ శాఖ ఉద్యోగుల నుంచి నిరసనలు చాన్నాళ్ల కిందటే ప్రారంభమయ్యాయి. అయితే, వాటిని ముందు నుంచీ బేఖాతరు చేస్తూ వస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ మధ్యనే తాసిల్దార్ విజయారెడ్డి హత్య అంశంతో భద్రతపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. పని భారం ఎక్కువౌతోందనీ, లెక్కకు మిక్కిలి జీవోలతో గందరగోళం నెలకొందనీ, ఇలా కొన్ని కారణాలు చెబుతూ తమ సమస్యలపై చర్చించాలంటూ మంత్రి కేటీఆర్ ని కలిసి రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నిస్తే.. వాటి గురించి తరువాత మాట్లాడుకుందామన్నారు! ప్రక్షాళన తప్పదు అని ముఖ్యమంత్రి పదేపదే చెబుతూ ఉండటంతో ఆ శాఖ ఉద్యోగుల్లో అభద్రత నెలకొన్న మాట వాస్తవమే.
ప్రభుత్వ వైఖరిపైగానీ, కొత్త చట్టంపైగానీ నిరసన వ్యక్తం చేసే ధైర్యం ఉద్యోగులకు లేకుండా పరిస్థితులు మారిపోయాయి. ఆర్టీసీ సమ్మె అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొండివైఖరే అందుకు ఉదాహరణ. ఓరకంగా ఇది అన్ని శాఖలు, అనుబంధ సంస్థల ఉద్యోగులకు హెచ్చరిక లాంటిదే. మీరెంత అరిచి గీపెట్టినా…. మేం అనుకున్నదే అంతిమంగా జరుగుతుందనే సందేశం ఇచ్చేశారు. నిజానికి, రెవెన్యూ ఉద్యోగుల విషయంలో గత నెలరోజు నుంచీ కేసీఆర్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యనే… అధికార పార్టీ ఎమ్మెల్యేల అతి జోక్యం వల్లనే తాము విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నామంటూ రెవెన్యూ ఉద్యోగ సంఘాలు నిరసనలకు దిగిన ఘటనను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చనీయకుండా… వెంటనే ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నారట! ఆ శాఖపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారనీ, దాన్ని ఎమ్మెల్యేలపై మరల్చేందుకు ఉద్యోగ సంఘాలు ప్రయత్నిస్తున్నాయనీ… రెవెన్యూ గురించి ఎవ్వరూ మాట్లాడొద్దని చెప్పారట. కొత్త చట్టం తీసుకొస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల నుంచి ఎలాంటి నిరసనలు వ్యక్తం కాకుండా అన్ని వైపుల నుంచి సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తున్నట్టుగా చెప్పొచ్చు.