వచ్చే దసరా నాటికి తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. చాలా మంది కలెక్టర్లు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. కొత్త జిల్లాల కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాలు ఎక్కడ ఉండాలనే దానిపైనా ఒక అంచనాకు వచ్చారు. ఆయా పట్టణాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ కార్యాలయలను ఉఫయోగించుకోవాలని భావిస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణలో ఐఎఎస్ అధికారులకు కొరత ఉంది. కొత్త జిల్లాలు ఏర్పడితే ప్రతి జిల్లాకు కనీసం ఇద్దరు ఐఎఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు కావాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు వాళ్లు దొరికే అవకాశం లేదు. అందుకే, కేసీఆర్ ఓ కొత్త ఆలోచన చేసినట్టు సచివాలయ వర్గాల సమాచారం.
ప్రస్తుతం ప్రతిజిల్లాకు ఒక కలెక్టర్, ఒక జాయింట్ కలెక్టర్ ఉన్నారు. ఇక ముందు జాయింట్ కలెక్టర్ పోస్టును రద్దు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. సాధారణంగా ఒక జిల్లాలో పరిపాలన బాధ్యతలన్నీ కలెక్టరే చూడటం కష్టమనే ఉద్దేశంతో జేసీ పోస్టును సృష్టించారు . దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ వ్యవస్థ అమల్లో ఉంది. కొన్ని శాఖలను జేసీలే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంటారు. విధానపరమైన అంశాలను కలెక్టర్ చూసుకుంటే, ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి విభాగాలను జేసీ చూస్తారు.
జాయింట్ కలెక్టర్ పోస్టు రద్దయితే అప్పుడు ప్రతి జిల్లకు తప్పనిసరిగా ఒకే ఐఎఎస్ అధికారి అవసరం ఉంటుంది. అదే కలెక్టర్ పోస్టు. మిగతా పనులున్నీ జిల్లా స్థాయి, గ్రూప్ వన్ తదితర అధికారులు చూసుకుంటే సరిపోతుందనేది తాజా ఆలోచన.
తెలంగాణ సచివాలయంలో సోమవారం ఈ విషయంపై అధికారుల మధ్య పిచ్చాపాటిగా చర్చ జరిగింది. సంఖ్య పెరగడం వల్ల జిల్లాల విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి జేసీ పోస్టు లేకపోయినా పరవాలేదని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు. విస్తీర్ణం ఎంతయినా, పాలన సరిగా జరగాలంటే కలెక్టర్ కు చేదోడువాదోడుగా జేసీ ఉండాల్సిందేనని మరి కొందరు అభిప్రాయపడ్డారు.
సచివాలయంలోని ఐఎఎస్ అధికారుల అభిప్రాయాలు ఎలా ఉన్నా, కొత్త జిల్లాలకు
కలెక్టర్లను నియమించడం తప్పనిసరి కాబట్టి కొత్త వ్యూహాన్ని అనుసరించడం మేలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అలాగే మొదట 24 అనుకున్న జిల్లాల సంఖ్య చివరకు 26 కావచ్చని సమాచారం. తన నియోజకవర్గం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారట. కొడుకు మాట కాదనలేని కేసీఆర్, ఆ మేరకు కసరత్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో కొత్తగా శంషాబాద్ ప్రతిపాదన వచ్చింది.
మొత్తం మీద కలెక్టర్లతో కేసీఆర్ మరోసారి సమావేశమైనప్పుడు ఈ ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చ జరుగుతుంది. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం ముసాయిదాను ప్రజల ముందుంచి అభ్యంతరాలుంటే తెలపాలని కోరుతారు. ఈ ప్రక్రియకు నెలరోజులైనా పడుతుంది. అయితే జిల్లాలు, డివిజన్లు, మండలాల ముసాయిదా బయటకు రాగానే ఆందోళనలు మొదలయ్యే అవకాశం ఉంది. తమ ఊరిని మండలంగా చేయాలని, తమ పట్టణాన్ని డివిజన్ గా లేదా జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తే అవకాశం ఉంది. ఇవి ప్రజలకు ఇబ్బందిగా మారకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.