తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనూ.. పీవీ నరసింహారావు ను ప్రధాన ఇష్యూగా చేసే వ్యూహాన్ని టీఆర్ఎస్ అమలు చేయడం ప్రారంభించింది. ఏడో తేదీ నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాలకు ఇప్పటి నుంచే సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో ఇప్పటికే ఓ దఫా మాట్లాడిన ఆయన… ఏ ఏ అంశాలను హైలెట్ చేయాలో డిసైడ్ చేస్తున్నారు. తాజాగా.. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై సమీక్ష జరిపిన కేసీఆర్… అసెంబ్లీలో కీలకమైన తీర్మానాలు చేయనున్నట్లుగా తెలిపారు. పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేస్తామని ప్రకటించారు.
నెక్లెస్ రోడ్ పేరు మార్చేసి.. పీవీ జ్ఞాన మార్గ్‌గా పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్ నిర్మాణం చేయాలని కూడా నిర్ణయించారు.పీవీ పుట్టి పెరిగిన లక్నెపల్లి, వంగరలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే పీవీ పేరిట అంతర్జాతీయ అవార్డు ఇవ్వాలని ఐక్యరాజ్య సమితికి విభాగం అయిన యునెస్కోకు ప్రతిపాదన పంపుతామని ప్రకటించారు. పీవీ శత జయంతి ఉత్సవాలను విదేశాల్లోనూ నిర్వహించాలని పిలుపునిచ్చారు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే వ్యూహంతో ఉన్న తెలంగాణ సీఎం… పీవీని ఓ పద్దతి ప్రకారం హైలెట్ చేస్తూ వెళ్తున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో..సమైక్య వాది అయిన పీవీని చాలా సార్లు కేసీఆర్ విమర్శించారు. అందులో దారుణమైన విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం.. తెలంగాణ వైతాళికుడిగా గుర్తించి… గౌరవం ఇవ్వడం ప్రారంభించారు. కారణం లేకుండా కేసీఆర్ ఏదీ చేయరు కాబట్టి..అదేమిటో ఫలితాలు వచ్చిన తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశంది.