తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తన గత రాజకీయ అడుగుల గురించి ఎక్కడా ప్రచారం జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. గతంలో జిల్లాల్లో బహిరంగసభలు పెట్టినప్పుడు తాను జాతీయ స్థాయికి వెళ్తున్నానని.. ఢిల్లీని ఢీకొట్టబోతున్నానని మీరంతా అండగా ఉండాలని కోరేవారు. ఇప్పుడు అసలు అలాంటి ప్రకటనలు లేకపోగా.. ప్రాంతీయ పార్టీలే మనకు రక్ష అని చెబుతున్నారు. కేసీఆర్ మాటలతో ప్రజల్లోనూ ఆయోమయం ఏర్పడింది. కానీ కేసీఆర్ మాత్రం ఆలాంటి ఆలోచన ప్రజలకు రాకుండా విస్తృత ప్రచారం చేసేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి లేదు. ఆ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి గతంలో పెద్ద ఎత్తున నేతల్ని పిలిపించుకుని పార్టీలో చేర్చుకున్నారు. ఒడిషా, ఏపీలకు ఇంచార్జుల్ని నియమించారు. తర్వాత జోరు తగ్గించారు. కేసీఆర్ తెలంగాణ నుంచి వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతూండటంతో… అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం పడుతుందని ఇతర రాష్ట్రాలపై దృష్టి తగ్గించారు. అయితే తన రాజకీయ ఉద్దేశాలకు భిన్నంగా ఇప్పుడు ప్రసంగాలు చేస్తున్నారు.
ప్రాంతీయపార్టీలే రక్ష అని.. వాటిదే భవిష్యత్ అని చెబుతున్నారు. ఓ రకంగా కేసీఆర్ తాను ఇప్పటికీ తెలంగాణ వాదాన్నే వినిపిస్తున్నానని… చెప్పకనే చెబుతున్నారు. ప్రజలకు అదే భావం అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ బలం ఇంత కాలం తెలంగాణ సెంటిమెంట్ మాత్రమే. ఇప్పుడు ఆ సెంటిమెంట్ లేకపోతే… బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుందన్నది రాజకీయవర్గాలకూ అంతు చిక్కనిదే. అందుకే తన బలాన్ని కేసీఆర్ మళ్లీ ఉపయోగించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.