తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. పట్టభద్రులు అంటే ప్రధానంగా ఉద్యోగాలు, ఉపాధి అంశాలు ప్రధానంగా ఉంటాయి. అందుకే టీఆర్ఎస్ సర్కార్ మొదట్లో తాము లక్షా 30వేల పై చిలుకు ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకుంది. స్వయంగా కేటీఆర్ కూడా అదే ప్రకటన చేశారు. టీఆర్ఎస్ అధికారంలోనికి వచ్చిన తర్వాత లక్షా ముప్పై రెండు వేల ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేసామని.. దీనిపై బహిరింగ చర్చకు సైతం అని సవాల్ విసరడం ప్రతిపక్షాలకు అస్త్రాన్ని అందించినట్టయింది. దీనిపై ప్రతిపక్షాలు లక్ష ఉద్యోగాలు భర్తిపై సవాల్ స్వీకరించడంతో టీఆర్ఎస్ ఇరకాటంలో పడింది. ఓ వైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ ఇదే ఉద్యోగాల భర్తీపై ఎదురు దాడి పెంచడంతో అధికార పక్షం ఢిఫెన్స్ లో పడింది.
కాంగ్రెస్ అధికార దాసోజు శ్రవణ్, అటు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ది ఎన్.రాంచందర్ రావు ప్రతిసవాల్ తో అధికార పక్షం సరైన సమాధానం ఇచ్చుకోలేక సతమతం అవుతోంది. ఒక్క శాఖలో భర్త చేసిన ఉద్యోగాలు ఇవిగో అంటూ వివరణ ఇచ్చుకోవడానికి నానా తంటాలు పడింది. ఇప్పటికే పీఆర్సీ లేక ఐఆర్ ప్రకటించకపోవడంతో ఉద్యోగులు కొంత సర్కార్ పై అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీనికి తోడు ప్రమోషన్లు కూడా లేక పోవడంతో గుర్రుగా ఉన్నారు. ఉద్యోగుల అసంతృప్తిని క్యాష్ చేసుకోవడానికి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో కేటీఆర్ వ్యూహం మార్చారు. బీజేపీ తెలంగాణకు చేసిన అన్యాయంపై విమర్శలు ప్రారంభించారు.
ఓ రోజు యూపీఏ ప్రభుత్వం హాయాంలో హైదరాబాద్ కు ఇచ్చిన ఐటిఐఆర్ ప్రాజెక్టు రద్దు అంశాన్ని చర్చకు పెట్టారు. తర్వాతి రోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. మరోసారి హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్ అంశాన్ని రంగంలోకి తెచ్చారు. వీటన్నింటికీ వివరణ ఇవ్వడానికి బీజేపీ నేతులకు తీరిక లేకుండా చేశారు. ఈ అంశాలపై వారు టీఆర్ఎస్ పై ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో ఉద్యోగాల భర్తీ గురించి మర్చిపోయారు. టీఆర్ఎస్ కోరుకుంది కూడా ఇదే. ఉద్యోగాల అంశాన్ని ఎన్నికల టాపిక్ నుంచి దృష్టి మరల్చడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయింది.