అభివృద్ధి జరిగిందని చెప్పడానికి అవకాశం ఉంటే… ఇదిగో ఇది మేం సాధించిన విజయం అంటారు! జరగడం లేదంటే… అధికారుల అలసత్వమనీ, కిందిస్థాయి నాయకుల వైఫల్యమని మాట్లాడతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్చంగా ఇలానే ఇప్పుడు మాట్లాడుతున్నారు. ప్రగతి భవన్లో పల్లె ప్రగతిపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్తగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇవి గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. దీన్లో పనిచేసే ప్రతీ అధికారికీ రేండమ్ గా 12 మండలాలు ఇస్తామనీ, అయితే ఎవరికి ఏ మండలం ఇచ్చామనే సమాచారం గోప్యంగా ఉంటుందన్నారు.
ఈ అధికారులు ఎప్పుడు ఏ గ్రామానికి వెళ్లి తనిఖీ చేస్తారనేది కూడా ముందస్తుగా ఎవ్వరికీ ఎలాంటి సమాచారం ఉండదన్నారు! పల్లె ప్రగతి కార్యక్రమం ఎలా అమలౌతోందనేది దీని ద్వారా నివేదికలు ప్రభుత్వానికి చేరతాయన్నారు. ఈ ఆకస్మిక తనిఖీలు పంచాయతీ రాజ్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల పనితీరుకు ఒక పరీక్ష లాంటిందే అన్నారు. ఎక్కడ ఎలాంటి అలసత్వం జరుగుతోందని తమ దృష్టికి వచ్చినా కఠిన చర్యలుంటాయనీ, ఏ స్థాయి అధికారులపైన అయినా, పంచాయతీ సర్పంచులపైన అయినా వేటు తప్పదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్న ఉత్సాహం ప్రజలకు ఉన్నా, ప్రజా ప్రతినిధులకూ స్థానిక అధికారులకు ఉండటం లేదంటూ ఇప్పటికే తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు.
సెప్టెంబర్ నెలలో ఈ పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. అప్పుడో ప్రణాళికను విడుదల చేసి, హుటాహుటిన గ్రామాల్లో పనులు జరిగిపోవాలని ఆదరబాదరగా ఆదేశాలు జారీ చేశారు. దానికి కొనసాగింపే ఈ ఆకస్మిక తనిఖీల కార్యక్రమం. పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నది ఏంటంటే… పల్లె ప్రగతి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయిందనే. అయితే, ప్రజలు దీన్ని ఆదరిస్తున్నారూ… అధికారులూ నాయకులూ మాత్రమే సరిగా పనిచేయడం లేదనే అభిప్రాయం కలిగించేలా మాట్లాడమే వ్యూహాత్మం. అంటే, ఏదైనా గ్రామంలో పల్లె ప్రగతి జరగలేదనుకోండి, అది కేసీఆర్ సాబ్ వైఫల్యం కాదు, స్థానిక నాయకులు అధికారులదే అనే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నమే ఇది! నిజానికి, సెప్టెంబర్లో మొదలుపెట్టినప్పుడే దీర్ఘాకాలిక ప్రణాళిక ప్రకటించాలి. అప్పుడేమో నెలలో అభివృద్ధి జరిగిపోవాలె, పల్లెల రూపురేఖలు మారిపోవాలె అన్నారు. నాలుగు నెలలు గడిచాక ఇప్పుడు ఆకస్మిక తనిఖీలు అంటున్నారు! అధికారులైనా నాయకులైనా.. గ్రామాభివృద్ధి అనేది బాధ్యతతో నిర్వహించాల్సిన కార్యక్రమంగా ప్రోత్సాహించాలిగానీ, భయపెట్టి చేయించాలనుకుంటే ఎలా..?