తెలంగాణ సీఎం కేసీఆర్ భూముల వ్యవహారంలో తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. పార్టీ కార్యాలయాలకు అతి తక్కువకు స్థలాలు కేటాయించుకున్నారు. ఇప్పుడు పార్టీ నేతలకూ ఆ ఆఫర్ ఇస్తున్నారు. బంజారాహిల్స్ అంటే ఎంత ఖరీదైన ప్రాంతమో చెప్పాల్సిన పని లేదు. తాము ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నామని… తాము నిరుపేదలమని దరఖాస్తు చేస్తే ఏకంగా ఇద్దరికి 1586 గజాలను నామమాత్రపు ధరతో రాసిచ్చేసింది. వారిద్దరు ఎవరో కాదు.. ఎంపీ కే. కేశవరావు కుమారుడు, కుమార్తె, కుమార్తె హైదరాబాద్ మేయర్.
నిరుపేదలమని దరఖాస్తు – రిజిస్ట్రేషన్ చేసేసిన ప్రభుత్వం
బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో 2,500 గజాల ప్రభుత్వ స్థలం ఉంది. దాన్ని కేకే ఆక్రమించి ఇల్లు కట్టేసుకున్నారు. నిరుపేదలు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించుకొని, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి తెలంగాణ సర్కారు ఇటీవల అవకాశం కల్పించింది. ఇదేదో తన కోసమేన్నట్లుగా కేకే వారసులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం కూడా జూన్ 12న బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసింది.
కనీసం సగ రేటు కూడా చెల్లించలేదు !
అమల్లో ఉన్న జీవో 59 నిబంధనల ప్రకారం మార్కెట్ విలువలో 50 శాతం రుసుముగా వసూలు చేయాలి. ఎక్కడో మోకిలాలో గజం లక్ష పలుకుతూంటే… బంజారాహిల్స్ లో ఎంత ఉండాలి. కానీ కేకే వారసులిద్దరూ కలిపించి చెల్లించింది కేవలం రూ.5.50 లక్షలు. అంటే గజానికి రూ.350. నిబంధనల ప్రకారం 251-500 గజాల వరకు 50 శాతం, 1000 గజాలకు మించితే 100 శాతం క్రమబద్ధీకరణ రుసుము చెల్లించాలి. ఇలా వసూలు చేసినా వారు కోట్లలో కట్టాల్సి వచ్చేది. ఎందుకంటే బంజారాహిల్స్ లో మార్కెట్ వాల్యూ 70వేలకు పైగానే ఉంది. వీరిద్దరి స్థలాల బహిరంగ మార్కెట్ విలువ రూ.30 కోట్లకు పైగానే ఉంది. వాస్తవ రుసుములో కేవలం 0.5 శాతం తీసుకొని రెండు స్థలాలను క్రమబద్ధీకరించారు. ఇందు కోసం ప్రత్యేకంగాజీవోల్ని విడుదల చేసినట్లుగా చెబుతున్నారు.
అసలైన పేదలకు మాత్రం మోత
కేకే వారసులు రిజిస్టర్ చేయించుకున్న స్థలం ఉన్న సర్వే నంబరులోనే ఉన్న పేదలకు మాత్రం మామూలు రేట్లే వసూలు చేశారు. అక్కడ ఎన్బీటీ నగర్లో మురికి వాడ ఉంది. అందులో వందగజాలలోపు నిరుపేదలే. వారు పది లక్షలకుపైగా చలాన్లు కట్టాల్సి వచ్చింది. కట్టలేని వారి ఇళ్లపైకి జేసీబీలు వెళ్తున్నాయి. ఎంపీ నిరుపేద అని చెబితే నమ్మడం ఓ వింత అయితే.. ఖర్చు లేకుండా క్రమబద్దీకరణ చేయడం.. పేదలకు మాత్రం వేరే రూల్స్ పెట్టడం… బంగారు తెలంగాణలో ఓ విధానమా అన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.