తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మొన్న సూచనగా వెల్లడించిన ఎన్నికల సర్వేను ఈ రోజు అధికారికంగా బయిటపెట్టారు. ఈ క్షణంలో ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్కు 106 స్థానాలు వస్తాయన్నారు. మజ్లిస్‌కు ఆరు ఇచ్చారు. అంటే ఇంకా ఏడు మాత్రమే మిగులుతాయి. బిజెపికి ఒక్క స్థానం కూడా రాదని పునరుద్ఘాటించారు. సిపిఐ సిపిఎంలకు గత రెండు సార్లు ఒక్కొక్కటి మాత్రమే వచ్చాయి గనక ఈ సారి అవి కూడా రావని ఆ సర్వే చెప్పడంలో ఆశ్చర్యమేమీ వుండదు. టిటిడిపి ఇప్పటికే కుప్పకూలింది గనక చెప్పడానికి ఏమీ వుండదు. ఏతావాతా తామే అప్రతిహతంగా తిరిగివస్తామని చెప్పడం కెసిఆర్ ఉద్దేశం. దాంతో పాటే మరో వ్యూహం కూడా వుంది.తమ పార్టీలో ఆశావహులను అసంతృప్త జీవులను అట్టిపెట్టుకోవడం, మిగిలిన పార్టీల వారు వచ్చి చేరేలా చేయడం, ప్రతిపక్షాల మనోస్థయిర్యాన్ని దెబ్బతీయడం వంటివి జరగాలనే రెండేళ్ల ముందుగా సర్వేలు మొదలు పెట్టారు. ఇది పాశ్చాత్య దేశాలలో ఒక నిరంతర ప్రక్రియ. మన దేశంలోనూ రాష్ట్రాలలోనూ గత కొన్నేళ్లుగా ఎవరో ఒకరు సర్వేలుచేయడం జరుగుతూనే వుంటుంది గాని ఆ ఫలితాలను సూటిగా విడుదల చేయరు. కాని కెసిఆర్ చేశారు. ఇలాటి పాచికలు అవసరమని ఆయన భావిస్తున్నారంటే తనకు కూడా ఏదో మూల కొన్ని సందేహాలు వున్నాయనుకోవచ్చు. టిఆర్ఎస్ అధికార దొంతర ప్రకారమే ఈ సర్వేలో మొదటి మూడు స్థానాల్లో వున్న నియోజకవర్గాలు కెసిఆర్ కెటిఆర్ హరీష్లవి కావడం గమనార్హం. తర్వాత చిక్కు లేకుండా గతంలో ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన రాజయ్యకు నాలుగో స్థానం దక్కింది.