రాజకీయ జేఏసీ ప్రభుత్వ విధానాలను తూర్పార బడుతుండటంతో.. ఏం చేయాలో పాలుపోని కేసీఆర్ కు తాజాగా మరో తలనొప్పి వచ్చిపడింది. నిన్నమొన్నటి దాకా పలు సర్వేల్లో జెట్ స్పీడ్ తో దూసుకుపోయిన కేసీఆర్ అండ్ పార్టీ ఇప్పుడు ఉలిక్కిపడుతోంది. గత కొంతకాలంగా మంత్రుల పనితీరుపై తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సర్వేలు హెచ్చరించడమే ఇందుకు కారణం. దీంతో తెలంగాణ ప్రభుత్వంలో ఇటు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అసలు ఈ సర్వే ఎవరు చేయించారు? దీని విశ్వసనీయత ఎంత? అన్న విషయాలను పక్కనబెడితే.. తెలంగాణలో సీనియర్ నేతలుగా పేరొందిన పలువురు సీనియర్ నాయకులు సరిగా పని చేయడం లేదన్న విషయం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తెలిసిపోయింది. వీరిలో సీఎం కుమారుడు కేటీఆర్‌తోపాటు సీనియర్ మంత్రులు జూపల్లి క్రిష్ణారావు, జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్, జగదీశ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరుల పేర్లు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే హరీశ్, ఈటెల, పోచారం శ్రీనివాసరెడ్డిల పనితీరు అనూహ్యంగా పెరిగింది. వీరు ముగ్గురు మినహాయిస్తే మరే మంత్రుల పనితీరు మెరుగ్గా లేకపోవడం కేసీఆర్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది. కేసీఆర్ తన నియోజకవర్గమైన గజ్వేల్‌లో తన ఆదరణను రోజురోజుకు పెంచుకుంటుంటే.. ఆయన కెబినెట్ సహచరులు ఇలా నెమ్మదించడం ఆయనకు మింగుడు పడటం లేదు. ఈ సర్వే వివరాలను కేసీఆర్ బయటపెట్టడం వెనక మతలబు ఏంటి? అన్నదానిపై పార్టీలో పెద్దలు జట్టు పీక్కుంటున్నారు. ఏదైనా మాకు రహస్యంగా చెబితే సరిపోతుంది కదా! మీడియాకు ఎందుకు ఇచ్చినట్లు? అని అధినాయకుడిపై గుర్రుగా ఉన్నారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రజాసంక్షేమాలు అమలు చేయడంలో దారుణంగా విఫలమైందని జేఏసీ వరుస ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ ఆందోళనలకు యువత మద్దతు పలుకుతుండటం అధికార పార్టీకి ఇబ్బందికరమే! మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐలు కూడా ప్రభుత్వం ఎప్పుడు దొరికితే అపుడు ఇరుకున పెడుతున్నాయి. ఒక్క ఎంఐఎం మినహా ప్రతిపార్టీ ప్రభుత్వాన్ని, దాని విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పలు ఉద్యమాలు, నిరసనలకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ పార్టీ మంత్రుల పనితీరు మందగించింది అన్న సర్వే వివరాలు బయటపెట్టడం వెనక రహస్యం ఏంటి?అన్నది తెలియడం లేదు. మొత్తానికి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించడానికి తెలంగాణ జేఏసీ, ప్రతిపక్షాలకు కేసీఆరే.. మంచి అస్త్రాన్ని అందించారనడంలో సందేహం లేదు.