తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య ఓ సర్వే చేయించుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సర్వేలో మంత్రుల తీరుతెన్నులను తెలుసుకున్నారట! ఉన్నట్టుండి ఇలాంటి సర్వేను కేసీఆర్ ఎందుకు చేయించుకుని ఉంటారూ అనేది చర్చనీయంగా మిగిలింది. ఈ సర్వే పరమార్థం ఏంటో ఇప్పుడు అర్థమౌతోందని చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ వర్గాల్లో హాట్‌హాట్‌గా మారుతోందీ సర్వే..! ఈ సర్వే ఆధారంగానే మంత్రుల పనితీరుపై సమీక్ష నిర్వహించి, క్యాబినెట్ కూర్పులో మార్పులూ చేర్పులకు రంగం సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. మంత్రి వర్గంలో కొంతమందికి ఊష్టింగ్ తప్పదని భావించొచ్చు.
నిజానికి, తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు అనే టాపిక్ ఈ మధ్య పెద్దగా వినిపించడం లేదు. ఒకవేళ విస్తరణ అంటూ జరిగితే కొప్పుల ఈశ్వర్ లాంటి వారికి అవకాశాలు దక్కుతాయని కథనాలు వినిపిస్తూ ఉండేవి. పార్టీపరంగా మినిస్టర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా ఈ మధ్య కాలంలో అయితే లేవు. మొదట్లో మంత్రి రాజయ్య విషయంలో పార్టీ డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంది. తరువాత అలాంటి పరిస్థితి లేదు. అయితే, తాజా సర్వే నేపథ్యంలో ఓ నలుగురుపై చర్యలు తప్పకపోవచ్చనే గాసిప్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇటీవల సర్వే చేయించుకున్నది కూడా అందుకేననీ… సదరు సర్వే ఆధారంగానే ఆ నలుగురు మంత్రులనూ తప్పించే ఆస్కారం ఉందని చెప్పుకుంటున్నారు.
అయితే, ఆ నలుగురు ఎవరనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు మంత్రులపై వేటు తప్పదని ఈ నేపథ్యంలో వినిపిస్తోంది. దీంతోపాటు గ్రేటర్ పరిధిలోని మరో కీలక మంత్రికి కూడా మార్పు తప్పదని అంటున్నారు. ఇక, నాలుగో మంత్రి ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. వీరిలో కొంతమంది తీరుపై ప్రజల నుంచే విమర్శలు వ్యక్తమౌతున్నాయనీ… మరికొందరికి పదవి ఇవ్వడం వల్లనే పార్టీకి తలవంపులు తప్పడం లేదన్న అభిప్రాయం కేసీఆర్‌కు కూడా ఉందనీ చెప్పుకుంటున్నారు.
మొత్తానికి, కేసీఆర్ ఈ మధ్య చేయించుకున్న సర్వే అంతిమ లక్ష్యం ఇదే అయి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్ నెలలోపు ఈ మార్పులూ చేర్పులూ చర్యలూ జరిగిపోయే అవకాశం ఉందని సమాచారం..! ఏపీతోపాటు ఇప్పుడు తెలంగాణలో కూడా మంత్రి వర్గ మార్పులు హాట్ టాపిక్‌గా మారిందన్నమాట.