గురువారం మధ్యాహ్నం ఒకటన్నరకు రెండో సారి తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తనతో పాటు మరొకరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని కేసీఆర్ ప్రకటించారు. సెంటిమెంట్ ప్రకారం అలా చేస్తున్నారని అనుకుంటున్నారు. కానీ ఆ ఒక్కరు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవలి కాలంలో ముస్లింలకు అత్యధిక ప్రాధన్యం ఇస్తున్నారు కేసీఆర్. మైనార్టీలను దేశం మొత్తం ఏకం చేస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. అందుకే.. మైనార్టీనే తనతో పాటు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం కనిపిస్తోందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
మైనార్టీ అయితే మహమూద్ అలీనే కొనసాగిస్తారని అంటున్నారు. గురువారం ఒకరితో ప్రమాణస్వీకారం చేయించి. నాలుగు, ఐదు రోజుల తర్వాత మరో ఐదుగురితో కేబినెట్ విస్తరణ చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.గత ఎన్నికల్లో కీలక పదవుల్లో ఉండి మొత్తం ఐదుగురు నేతలు ఓడిపోయారు. వారిలో నలుగురు మంత్రులు.. ఒకరు స్పీకర్. గెలిచిన మంత్రులందరికీ అవకాశం దొరుకుతుందా లేదా అన్నది ఆసక్తికరం. ఓడిపోయినా..తుమ్మల నాగేశ్వరరావుకు కేబినెట్ లో చోటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ.. మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్ చాట్ లో ఓడిపోయిన మంత్రులకు చాన్సిచ్చేది లేదని ప్రకటించారు. ఖమ్మం నుంచి గెలిచిన.. పువ్వాడ అజయ్.. కేటీఆర్ కు సన్నిహితుడు కాబట్టి… ఆయనకే అవకాశం దక్కనుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. మంత్రుల జాబితాలో ఇద్దరి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. వారిలో ఒకరు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కాగా .. మరొకరు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. సురేష్ రెడ్డి ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరారు. మొత్తానికి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది.