ఎప్పుడు ఏం జరుగుతుందో రాజకీయాల్లో ఊహించలేం. నిరంతరం నిప్పూ ఉప్పులా ఉండేవాళ్లు కూడా ఓ శుభముహూర్తాన ఠక్కున పాలూ నీళ్లు అయిపోయారు! అలాంటిదే ఒక ఆసక్తికరమైన ఘటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఈ విషయమై చర్చ జరుగుతోందని సమాచారం. ఆ చర్చకు కారకులు ఎవరంటే… కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రమైన విమర్శలు చేసే నాయకుల్లో వీహెచ్ కూడా ఒకరు. సమస్యలు చెప్పుకుందాం అంటే తనను కలిసే అవకాశం కూడా ముఖ్యమంత్రి ఇవ్వరూ అంటూ గతంలో ధ్వజమెత్తిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటిది…. ముఖ్యమంత్రి కేసీఆర్ కారులో వీహెచ్ వచ్చారంటే నమ్ముతారా..? కానీ, వాస్తవం ఇదే. ఒక ప్రైవేటు కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. అదే కార్యక్రమానికి వీహెచ్ కూడా వచ్చారు. ఆ వేదికపై ఇద్దరూ ఎదురుపడ్డారు. ఈ సందర్భంలో కేసీఆర్‌ను పలకరించిన వీహెచ్… ‘అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని సమస్యలున్నాయి. కలిసి చెప్పుకుందాం అనుకుంటే మీ అపాయింట్ దొరకడం లేదు’ అన్నారు. వెంటనే స్పందించిన కేసీఆర్.. ‘ఇప్పుడు నాతో మీరు వచ్చెయ్యండీ. మనిద్దరం కూర్చుని మాట్లాడుకుందాం’ అంటూ తన కాన్వాయ్ లో వీహెచ్‌ను ఎక్కించుకుని ప్రగతి భవన్‌కు వెళ్లారు. అంతేకాదు, ఆ తరువాత దాదాపు ఓ ముప్పావు గంటపాటు వారిద్దరూ చర్చించుకున్నారు.
వీహెచ్ అలా వెళ్లడం మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే, ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేతను ‘గౌరవం’ పేరుతో శాసన సభలో వ్యూహాత్మకంగా మాట్లాడనీయకుండా చేస్తున్నారు. ‘పెద్దవారు’ అని జానాని కేసీఆర్ సంబోధిస్తూ కంట్రోల్లోకి తెచ్చుకున్నారనే వాదన ఉంది. ఇప్పుడు కాంగ్రెస్‌లో మరో సీనియర్ నేతను ఇలా సొంత కారులో ఎక్కించుకుని దోస్తీ కుదుర్చుకున్నారు. తనపై తీవ్రంగా విమర్శలు చేసే నాయకులను ఇలా ఎమోషనల్‌గా కేసీఆర్ కట్టిపడేశారని అనుకోవాలి!
మొత్తానికి, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను కేసీఆర్ తనదైన రాజకీయ వ్యూహాలతో కట్టడి చేశారనే భావన వ్యక్తమౌతోంది. ముఖ్యమంత్రి కారులో వీహెచ్ ప్రయాణించడం కొంతమంది కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం నచ్చడం లేదట! ఇన్నాళ్లూ జానా వల్ల పార్టీకి ఇబ్బందులు పెరుగుతున్నాయని అనుకుంటే, అదనంగా ఇప్పుడు వీహెచ్ కూడా మారిపోతున్నారా అనే ఆందోళన హస్తం నేతల్లో వ్యక్తమౌతోందని చెబుతున్నారు.