ఫెడరల్ ఫ్రంట్ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ .. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సమావేశం అయ్యారు. భువనేశ్వర్ నుంచి నేరుగా కోల్ కతా వెళ్లిన ఆయనకు…ఘనస్వాగతం లభించింది. మమతా బెనర్జీతో దాదాపుగా అరగంట సేపు చర్చలు జరిపారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మమతాబెనర్జీతో జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు చెప్పారు. గుణాత్మక మార్పు రావాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళికతో మీ ముందుకొస్తామని సీఎం వెల్లడించారు. ఫెడరర్ ఫ్రంట్ ఏర్పాటుపై నిన్నటి నుంచే చర్చలు ప్రారంభమయ్యాయని, ఇక ముందు కూడా చర్చలు కొనసాగుతాయని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి..బలోపేతం కోసం కృషి చేస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అంత తేలిక కాదని తేల్చారు. అయితే కేసీఆర్ తో జరిపిన చర్చల వివరాలపై మీడియాతో మాట్లాడేందుకు మమతా బెనర్జీ ఆసక్తి చూపించలేదు.
భునవేశ్వర్ లో నవీన్ పట్నాయక్ .. ఫెడరల్ ఫ్రంట్ గురించి.. ఒక మాట మాట్లాడినప్పిటీకి మమతా బెనర్జీ మాత్రం.. అసలేమీ మాట్లాడలేదు. కనీసం ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవ్వాలన్న మాటలు కూడా ఆమె మాట్లాడలేదు. కేసీఆర్ కూడా.. తాము కచ్చితంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని… అందులో మమతా బెనర్జీ ఉంటారన్న నమ్మకాన్ని కల్పించలేకపోయారు. పైగా హైదరాబాద్ లాగా ఏర్పాటు చేయాల్సింది కాదని వ్యాఖ్యానించారు. దీంతో.. మమతా బెనర్జీ… కేసీఆర్ ప్రతిపాదిత ఫ్రంట్ పై ఎలాంటి సానుకూలత వ్యక్తం చేయలేదన్న ప్రచారం జరుగుతోంది.
కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఢిల్లీకి వెళ్తారు. రెండు, మూడు రోజుల పాటు కేసీఆర్ దిల్లీలోనే ఉంటారు. ఎస్పీ, బీఎస్పీ అగ్రనేతలను.. కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. అపాయింట్ మెంట్ దొరికిన తర్వాత ప్రధాని మోదీని కూడా కలవనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తారు.