“పట్టుపడితే తానేమి చేస్తానో, తన బలమేమిటో ప్రధానమంత్రి మోదీకి తెలుసు” అని టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ అన్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఎంపీలతో చర్చలు జరిపారు. పోరాటంలో ఎంత మాత్రం వెనక్కి తగ్గవద్దని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నారు.. ఆ తర్వాత బీజేపీతో యుద్ధమేనని ఇక అమీతుమీ తేల్చుకోవడమే తప్ప వెనక్కి తగ్గేది లేదన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులు ధర్నాలతో దేశం మొత్తం దద్దరిల్లాలని స్పష్ంట చేసారు. నిధులు, ప్రాజెక్టుల కోసం తీవ్ర ఒత్తిడి తేవాల్సిందేని ఎంపీలకు స్పష్టం చేశారు.
పార్లమెంట్ సమావేశాలను స్తంభింపచేయడానికే కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ పోరాటం కేసీఆర్ మాటల్లో చెప్పినంత తీవ్రంగా ఉంటుందా లేక గతంలోలా బీజేపీకి ఇబ్బంది లేకుండా పోరాటం చేస్తారా అన్నది ముందు ముందు తేలనుంది. గతంలో వడ్ల కొనుగోలు అంశంపై ఇతర పార్టీలు ఇతర అంశాలపై సభను స్తంభింపచేసినప్పుడు ప్లకార్డులతో ఫోటోలు దిగి పబ్లిసిటీ చేసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వతా అర్థాంతరంగా సభను బాయ్ కాట్ చేసేశారు. దీంతో బీజేపీకి ఇబ్బంది లేకుండా పోరాటం చేస్తున్నారన్న అభిప్రాయం వినిపించింది.
ఈ సారి మాత్రం బీజేపీని చిక్కుల్లో పెట్టాలన్న వ్యూహంతో కేసీఆర్ ఉన్నారని ఎంపీల భావిస్తున్నారు. రోజువారీగా ఏం చేయాలన్నదానిపై దిశానిర్దేశం చేసేందుకు ఎంపీల కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలను కూడగట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ఉన్న ఇబ్బంది ప్రో బీజేపీ ఇమేజే. దాన్ని తుడిపేసుకోవడానికి ఈ పార్లమెంట్ సమావేశాలను ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.