అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా మరోసారి జాతీయ స్థాయి రాజకీయాల గురించి తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. మధిరలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ… ప్రజాస్వామ్యంలో గెలవాల్సినవి పార్టీలూ నాయకులూ కాదనీ, ప్రజలేనంటూ స్టార్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చి తాను కాంగ్రెస్ ఏజెంట్ అంటారనీ, రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి వచ్చి తాను బీజేపీ ఏజెంట్ అంటూ విమర్శిస్తున్నారన్నారు. వాస్తవానికి తాను ప్రజల ఏజెంట్ ని అని కేసీఆర్ చెప్పుకున్నారు.
ఈ రెండు జాతీయ పార్టీలకూ కేసీఆర్ ని చూస్తే ఎందుకు వణుకు అన్నారు? ‘కాంగ్రెసేతర, భాజపాయేతర కూటమి కేంద్రంలో రావాలని కేసీఆర్ ప్రతిపాదిస్తున్నడు. నాకు మంచి హిందీ భాష వస్తది. ఈ ఎలక్షన్ల తరువాత ఢిల్లీ పోతే చీల్చి చెండాడతా. కేసీఆర్ ని ఇక్కడికే పరిమితం చెయ్యాలే, ఇక్కడ్నే చిన్నబుచ్చాలె అనే ఒక దుర్మార్గమైన రాజకీయ ఆలోచన పెట్టుకుని ఈ సిల్లీ పాలిటిక్స్ ఆడతా ఉన్నారు’ అన్నారు కేసీఆర్. వీడు వాని మీదా, వాడు వీని మీదా ఎంతకాలం నడుస్తాయండీ ఈ రాజకీయాలన్నారు. ఈ దేశానికి భగవంతుడు 70 వేల టి.ఎమ్.సి.ల నీళ్లు ఇచ్చాడనీ, కానీ వీళ్లు వాడింది 30 వేల టి.ఎమ్.సి.లు కూడా లేదన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలున్నాయనీ, కరవు ఉందనీ, డెబ్బయ్యేళ్లు పాలించిన ఈ పార్టీలు ఏం చేశాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెరాస మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయన్నారు.
కేసీఆర్ ని రాష్ట్రానికే పరిమితం చేయాలని మోడీ, రాహుల్ గాంధీ చూస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు కదా! వాస్తవానికి అలా ఎవర్నీ ఎవరూ పరిమితం చేయలేరు. జాతీయ స్థాయిలో ఒక అజెండా ఉంటే, దానికి మద్దతుగా కొన్ని పార్టీలు తోడు వస్తే… ఎవరైనా కూటములు కట్టొచ్చు, ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు. అయినా, ఇదంతా లోక్ సభ ఎన్నికలప్పుడు జరిగే ముచ్చట. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు… నాలుగేళ్ల తెరాస పాలనకు రెఫరెండమ్ మాత్రమే. అంతేగానీ… రాబోయే రోజుల్లో కేసీఆర్ జాతీయ స్థాయిలో పోషించాల్సిన పాత్రకు లభించాల్సిన ఆమోదం కాదు. ఆ ప్రాతిపదికన ప్రజలు ఓట్లెయ్యరు. తనకు హిందీ వచ్చనీ, ఢిల్లీ పోయి చీల్చి చెండాడతా అంటున్నారు కేసీఆర్. ఇలా ఎన్నైనా చెప్పొచ్చుగానీ… అయితే, ఇవన్నీ లోక్ సభ ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు కదా! ఇప్పుడు.. ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్, మోడీలు చేస్తున్న విమర్శలకు ధీటైన సమాధానాలు కేసీఆర్ చెప్పాలని ప్రజలు చూస్తున్నారు.