తెలంగాణ విమోచన దినోత్సావాన్ని ఘనంగా జరపాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో భారీ సభ ప్లాన్ చేసుకున్నారు. కేంద్రం నుంచి ముఖ్య అతిథులు వస్తున్నారు. ఈ సెప్టెంబర్ 17ని భాజపాకి రాజకీయంగా పనికొచ్చే అంశంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ వస్తే విమోచన దినాన్ని అధికారికంగా చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్, ఇప్పుడు మజ్లిస్ పార్టీకీ ముస్లింలకూ భయపడి దాన్ని పక్కన పెట్టారంటూ భాజపా ఎప్పటికప్పుడు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ శాసన సభలో సెప్టెంబర్ 17 గురించి మాట్లాడారు.
సెప్టెంబర్ 17 గురించి కూడా తాను మాట్లాడాల్సి ఉందనీ, అందుకే స్పందిస్తున్నానని మొదలుపెట్టి… కొత్తగా మతం పుచ్చుకున్నోడికి నామాలు ఎక్కువ అంటూ చమత్కరించారు! కొంతమంది ఏదో గడ్ బడ్ చేస్తున్నారనీ, ఆరోజున ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుందన్నట్టు, దానికి తామే ఏదో చేస్తామన్నట్టు చెబుతున్నారంటూ పరోక్షంగా భాజపా మీద విమర్శలు చేశారు. ఆరోజున మేము కూడా తెలంగాణ భవన్ మీద జాతీయ జెండా ఎగరేస్తామన్నారు. దీని గురించి పెద్దగా చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో యురేనియం తవ్వకాల గురించి సీఎం కూడా స్పందించి… ఎవ్వరికీ అనుమతులు ఇవ్వమనీ, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రయత్నించినా అడ్డుకుంటామన్నారు. ఇదే అంశాన్ని శాసన సభ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క కోరితే… రేపే తీర్మానానికి ఏర్పాట్లు చేయాలంటూ సీఎం ఆదేశించారు.
విమోచన దినోత్సవం నాడు తాము కూడా జెండా ఎగరేస్తామని సీఎం అన్నారు. అందరూ అదే పని చేస్తున్నారు కాబట్టి, తామూ అదే చేస్తామనేది కేసీఆర్ ఉద్దేశం. ఆ రోజుకి అంతగా ప్రాధాన్యత లేదా అన్నట్టుగా తెరాస అభిప్రాయం ఉందన్నది కనిపిస్తోంది. కానీ, ఉద్యమ సమయంలో దీన్నొక ఎమోషనల్ ఇష్యూగా వాడుకున్నారు. రాష్ట్రం వస్తే అధికారిక దినోత్సవం చేస్తామని కూడా అన్నారు. ఆ హామీ తీవ్రతను తగ్గించుకూంటూ వచ్చేశారు. ఇప్పుడు కూడా భాజపా ఇదే అంశాన్ని పట్టుకుని హడావుడి చేస్తోంది కాబట్టి, తప్పక స్పందించాలీ అనే మొక్కుబడితనమే సీఎం వ్యాఖ్యల్లో ఉంది. భాజపాకి ఈ విమోచన దినం ఇవాళ్ల గుర్తొచ్చిందా, అయినా అధికారికంగా వాళ్లు చేసుడేంది మేం చేస్తాం అని కచ్చితంగా చెప్పి ఉంటే… ఈ అంశాన్ని అడ్డుకుపెట్టుకుని ప్రయోజనాలు ఆశిస్తున్న భాజపాకీ ధీటైన కౌంటర్ అయ్యేది.