తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముంచుకొస్తున్న సమయంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో హైలెట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు తెలంగాణలోనే పరిస్థితి క్లిష్టంగా ఉందని విశ్లేషణలు వస్తున్న సమయంలో ఆయన అసలు రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. టీఆర్ఎస్ను పట్టించుకోకుండా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడం ఏమిటన్నది ఇప్పుడు టీఆర్ఎస్లోనే చర్చనీయాంశం అయింది. కానీ కేసీఆర్ ఏం చేసినా లాజిక్ ఉంటుందని అనుకుంటున్న కొంత మంది మాత్రం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఏకపక్ష మద్దతు కోసం మరోసారి తెలివైవ పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు.
దేశమంతా తిరిగి మోదీతో ఢీ అంటే ఢీ అనే పొజిషన్‌కు వచ్చానని.. దేశంలో ఇతర రాష్ట్రాల ప్రజలు మద్దతిస్తున్నారని తెలంగాణ ప్రజలు మద్దతివ్వకపోతే పరువుు పోతుందని ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. కేసీఆర్ ఎప్పుడూ ఓ సామెత చెబుతూంటారు.. అదేమిటంటే.. “నవ్వేటోడి ముందు జారిపడేలా చేయవద్దు” అని . ఈ సారి ఇదే ఫార్ములాతో ఆయన తెలంగాణ ప్రజల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ వ్యూహమే జాతీయ పార్టీ అని చెబుతున్నారు. తెలంగాణ బిడ్డ జాతీయ రాజకీయాల్లోకి చక్రం తిప్పడానికి వెళ్తే మద్దతివ్వరా అనే ఓ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ముందు ముందు టీఆర్ఎస్ ప్లాన్ అని భావిస్తున్నారు.
కేసీఆర్ జాతీయ పార్టీ కి ఇతర రాష్ట్రాల్లో చాన్సులుంటాయని ఎవరూ అనుకోవడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం పేరుతో ప్రజల ఓటింగ్ ప్రయారిటీని మార్చే అవకాశం మాత్రం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజా ప్వతిరేకతను కాకుండా…బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కొంటున్న తమ నేతకు తెలంగాణ ప్రజలు మద్దతివ్వాలన్న ఓ ఎజెండాను ముందుకు తెస్తారు. దీని వల్ల కేసీఆర్‌కు అంతిమంగా తెలంగాణలో లాభం జరుగుతుంది. తన పాలనపై.. అభివృద్ధిపై కన్నా.. కేసీఆర్‌కు నేషనల్ లెవల్లో పోరాడేందుకు మద్దతు అనే అస్త్రం ద్వారా తెలంగాణలో మరోసారి కేసీఆర్ పీఠం నిలపెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.