తెలంగాణ అసెంబ్లీ రద్దు అనే వ్యవహారం గత నెల రోజులుగా.. రాజకీయ పార్టీలకు హ్యాంగోవర్గా మారింది. చివరికి.. తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రులకు కూడా.. దీనిపై క్లూ లేదు. కేసీఆర్ ఏం చేస్తారు..? ఏం చేయబోతారన్నదానిపై .. ఎవరికీ క్లారిటీ లేదు. వాళ్లకు ఉన్న క్లారిటీ ఒక్కటే. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. కిక్కురుమనకుండా.. జైకొట్టడం. అలాంటి సందర్భాల్లో ముందస్తుపై మీడియా మాత్రమే కథనాలు ప్రసారం చేసింది. కానీ ఆ మీడియాకూ చివరి వరకూ స్పష్టమైన సమచారం లేదు. అన్నీ అప్పుడే జరిగినట్లు.. గురువారం.. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన కేబినెట్ తర్వాత రెండు గంటల్లో మొత్తం వ్యవహారం పూర్తయిపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన కూడా అయిపోయింది. అది రాజకీయం.. అధికారికంగా జరగాల్సింది కూడా.. అరగంట, గంటలో అయిపోయింది. అదేలా సాధ్యమయిందో.. అంచనా వేస్తే… ” హమ్మ.. ఇంత జరిగిందా..?” అని ఆశ్చర్యపోక తప్పని పరిస్థితి.
కేసీఆర్ కేబినెట్ భేటీ నాలుగు నిమిషాలు నిర్వహించారు. కానీ అధికార రికార్డులకు మాత్రమే అది. అంతకు ముందే తీర్మానం రెడీ అయింది. ముహుర్తం ప్రకారం గవర్నర్ దగ్గరకు వెళ్లారు. అలా ఇలా బయటకు రాగానే.. కేసీఆర్.. ఇంకా తెలంగాణ భవన్‌కు చేరుకోక ముందే… గవర్నర్.. అసెంబ్లీని రద్దును ఆమోదించేసినట్లు .. సంతకాలు చేసేసినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. నిజానికి కేసీఆర్ ఇచ్చేది.. లాంచనమైన తీర్మానమే. అసలు కేబినెట్ తీర్మానానికి స్పీకర్ సంతకం చేసిన పత్రం… అసెంబ్లీ సెక్రటరీ.. రాజ్‌భవన్‌కు తీసుకొచ్చారు. దానిపై ఆయన అంతకు ముందెప్పుడో సంతకం చేశారు. అంటే అంతకు ముందే … కేబినెట్ తీర్మానం ముగిసి.. ఆ పత్రం… అసెంబ్లీ దగ్గరకు వెళ్లింది. దానిపై స్పీకర్ సంతకం తీసుకుని రాజ్‌భవన్ తీసుకెళ్లడం.. ఆయన సంతకం చేస్తున్న వీడియోలు తీసుకోవడం జరిగిపోయింది. గవర్నర్ సంతకం చేస్తున్న దృశ్యాల్లో అసెంబ్లీ అధికారులు కూడా ఉన్నారు. కేసీఆర్ రాజ్‌భవన్‌కు వచ్చి లాంఛనంగా తీర్మానం ఇచ్చిన తర్వాత ఆ దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు. ఇక్కడి వరకూ.. ఎపిసోడ్ చూస్తే.. గవర్నర్ అసెంబ్లీ రద్దు ముందే పూర్తయిపోయిందని తెలిసిపోతుంది.
దీనికి మరో ఉదాహరణ… ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే… గెజిట్ విడుదల కావడం. గెజిట్ విడుదల చేయడమంటే.. ప్రింటర్లో ప్రింట్ తీయడం కాదు. దానికో ప్రాసెస్ ఉంటుంది. దాని కోసం కనీసం రెండు గంటల సమయం పడుతుంది. ఇలాంటి గెజిట్లు ప్రింట్ చేసే ప్రెస్ చంచల్ గూడలో ఉంటుంది. అప్పటికప్పుడు ప్రింట్లు చేయడం కుదిరే పని కాదు. కానీ నిమిషాల వ్యవధిలోనే అంతా పూర్తయింది. అంతేనా… ఈ గెజిట్ గురించి ఇంకా అయోమయంలో ఉండగానే.. గవర్నర్… కేసీఆర్ ఆపద్ధర్మ సీఎంగా నియమించారని.. దానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసేశారు. కేర్ టేకర్ సీఎంగా ఎవరైనా ఉన్నారంటే.. రాజ్‌భవన్ ఆదేశాల మేరకు.. వారు ఉన్నట్లు సీఎస్ ఆదేశాలు జారీ చేస్తారు. అలా చేశారు..! అంటే.. అన్నీ.. ముందే సిద్ధం చేసుకున్నట్లు టైం.. ప్రకారం.. ఒకదాని తర్వాత ఒకటి అలా విడుదల చేస్తూ పోయారు. ఊరకే.. సీఎం, గవర్నర్ సహా ఇతరులంతా… సమయానికి తగ్గట్లు వ్యవహరించారు. అంతే..! పక్కా ప్లాన్డ్గా అలా ముగించేశారు..!