తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరి పదిహేను రోజులవుతోంది. ఇంకా ఎమ్మెల్యేల ప్రమాణాస్వీకారం కూడా పూర్తి కాలేదు. కొత్త ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉత్సాహంగా ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు మాత్రం మంత్రి పదవుల ఊహల్లో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఆశావాహుల ఎదురుచూపులకు కేసీఆర్ శుభవార్త అందిస్తారని తెలుస్తోంది. తెలంగాణ భవన్ లో కాబోయే మంత్రులెవరనే చర్చ జోరుగా నడుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సాయంత్రం మోదీతో భేటీ అవుతారు. రేపు సాయంత్రం ఆయన తిరిగి వస్తారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ.. 28వ తేదీ విస్తరణ ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. 28నే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా లేదా అనేది చివరి నిమిషం వరకు సస్పెన్స్ గానే ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ దాటితే సంక్రాంతి పూర్తయ్యే వరకు మంచి ముహూర్తాలు లేనందునా ఈ నెలాఖరునే కొత్త మంత్రి వర్గం కొలువుదీరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ముహూర్తాలు, తేదీల విషయాన్ని పక్కనపెడితే మంత్రి వర్గ కూర్పు ఎలా ఉంటుందనే విషయంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సభ్యుల సంఖ్య ప్రకారం మంత్రుల సంఖ్య 18కి మించకూడదు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ….మరో మంత్రి మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేసారు. ఇక మరో 16 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు అన్ని మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం కనిపించడం లేదు. పరిపాలనా సౌలభ్యం కోసం ఆరు నుంచి ఎనిమిది మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి …మిగతా వారి పై పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
తొలి విడత విస్తరణలో గులాబీ బాస్ కేసీఆర్కు అత్యంత సన్నిహితులు… విధేయులకు సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి జోగురామన్న లేదా మహిళ కోటాలో ఇవ్వాల్సి వస్తే రేఖా నాయక్, నిజామాబాద్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి లేదా ప్రశాంత్ రెడ్డి, మెదక్ నుంచి హరీష్ రావు, కరీంనగర్ నుంచి ఈటెల రాజెందర్, కొప్పుల ఈశ్వర్ , వరంగల్ నుంచి కడియం శ్రీహరి, ఎర్రబెల్లి. దయాకర్ రావులు మహబూబ్ నగర్ నుంచి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నల్గొండ నుంచి జగదీశ్ రెడ్డి లేదా గుత్తా సుఖేందర్ రెడ్డి ఉండే అవకాశం ఉంది. ఈ విడతలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండకపోవచ్చని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.