తెలంగాణ సీఎం కేసీఆర్కు ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు ఈ విషయాన్ని … నేరుగా చెప్పలేదు. కానీ ఖచ్చితమైన ఫలితం రాలేదని మాత్రం ప్రకటించారు. ఖచ్చితమైన ఫలితం అంటే.. నెగెటివ్ అని రాకపోవడమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు, మూడు రోజుల్లో మరోసారి కేసీఆర్ శాంపిల్ తీసుకుని ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహిస్తామని డాక్టర్ ఎంవీరావు ప్రకటించారు.
పది రోజుల తర్వాత బుధవారం.. కేసీఆర్కు యాంటీజెన్ టెస్టు నిర్వహించారు. అందులో నెగెటివ్ వచ్చింది. అయితే ఖచ్చితమైన రిపోర్ట్ రావాలంటే… ఆర్టీపీసీఆర్ టెస్టు ద్వారా నిర్ధారణ చేసుకోవాలి కాబట్టి.. నిన్న శాంపిల్ తీసుకున్నారు. టెస్ట్ చేశారు. అనుకున్నట్లుగా పాజిటివ్ ఫలితం రాకపోవడంతో… ఖచ్చితమైన ఫలితం రాలేదని.. డాక్టర్ ఎంవీరావు చెబుతున్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు.
వైరస్ తగ్గు ముఖం పడుతున్న సమయంలో ఖచ్చితమైన ఫలితం రాదని కూడా విశ్లేషిస్తున్నారు. కేసీఆర్కు ఆర్టీపీసీఆర్ టెస్టులోనూ నెగెటివ్ వస్తుందేమో అని ఎదురు చూసిన అధికార యంత్రాంగానికి మరో రెండు, మూడు రోజులు ఎదురు చూడక తప్పదు. పరిపాలనా సంబంధమైన కీలకమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.