చరిత్ర కొన్ని మలుపులు తిరిగినప్పుడు అనివార్యంగా కొన్ని మార్పులు వస్తాయన్నారు మంత్రి కేటీఆర్. నిజాంపేట్ లో నిర్వహించిన మన హైదరాబాద్, మనందరి హైదరాబాద్ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత టీడీపీ ఎమ్మెల్యేలు తెరాసలోకి వచ్చారనీ, దాదాపు టీడీపీలో విలీనమైన పరిస్థితి ఉందన్నారు. తెలుగువారికి టీడీపీ వల్లనే గుర్తింపు వచ్చిందనీ, అదో చరిత్ర అన్నారు. 2014 ఎన్నికల సమయంలో హైదరాబాద్ లో చాలామందికి చాలా అనుమానాలున్నాయనీ, ఇక్కడి సెటిలైనవారిపట్ల తెరాస ఎలా వ్యవహరిస్తుందో అని తనను చాలామంది అడిగేవారన్నారు. తెరాస ప్రభుత్వంలో ఈ నాలుగున్నరేళ్లలో ప్రాంతీయ వివక్ష అనేది ఎక్కడ కనిపించిందా అన్నారు.
కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారనే విషయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకీ తెలుసనీ, అందుకే పదో పన్నెండో సీట్లు మాత్రమే పోటీ చేస్తామని అంటున్నారని కేటీఆర్ అన్నారు. ఇక్కడ టీడీపీకి గెలిచేదీ లేదు, వచ్చేదీ లేదనే అవగాహన ఆయనకీ ఉందన్నారు! ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేసిన కొన్ని విమర్శలు ఇక్కడి సెటిలర్ల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని కొంతమంది తన దృష్టికి తెచ్చారనీ, అయితే ముఖ్యమంత్రి ఉద్దేశం ఇక్కడి ప్రజలను ఉద్దేశించి కాదనీ, రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబును ఉద్దేశించి అన్నారని వివరించారు! రాజకీయాల్లో తలపడుతున్నప్పుడు ఇలాంటి విమర్శలు సహజంగానే ఉంటాయన్నారు. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటప్పుడు గడ్డాల గురించీ అనుకుంటాం, ఇంకా చాలా అనుకున్నాం.. దాన్ని ప్రజా బాహుళ్యాన్ని ఉద్దేశించి అన్నవిగా భావించొద్దన్నారు. అయితే, చంద్రబాబు విషయంలో కొన్ని మినహాయింపులున్నాయనీ, ఇక్కడి తెరాస ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన మాట వాస్తవం అన్నారు.
నల్గొండలో దురదృష్టవశాత్తు హరికృష్ణ మరణిస్తే.. మంత్రి జగదీష్ రెడ్డి ఉదయాన్నే ఘటనా స్థలికి వెళ్లారనీ, తరువాత వారి కుటుంబాన్ని ఓదార్చామన్నారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడుతో మాటల సందర్భంలో పొత్తు చర్చ వచ్చిందనీ, తెరాస టీడీపీ కలిసి ఉండాల్సిందని ఆయన అన్నారన్నారు. అది సాధ్యపడదనీ, రాష్ట్రాలు మారినప్పుడు ప్రయోజనాలు కూడా మారిపోయాయనీ తాను చెప్పానన్నారు. తెలుగు జాతి ఐక్యంగా ఉండాలనే ఆలోచన ఉద్దాత్తమైనదేగానీ అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదని తాను వివరించాను అన్నారు. అమరావతి శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ వెళ్లారనీ, ఆయన వేదిక ఎక్కుతుంటే సామాన్య ఆంధ్రా ప్రజలు చేసిన హర్షద్వానాలు అందరికీ గుర్తున్నాయన్నారు. విభజన మనమే కోరుకున్నాం కాబట్టి, సుహృద్భావ కానుకగా రూ. 100 కోట్లు ప్రకటించి వద్దామని కేసీఆర్ వెళ్లారనీ, కానీ అదే కార్యక్రమానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదీ ప్రకటించడం లేదని తెలిసేసరికి… కేసీఆర్ ఆశ్చర్యపోయి తానూ ఆగిపోవాల్సి వచ్చిందని తరువాత చెప్పారన్నారు!
మొత్తానికి, నొప్పించిన తానొవ్వక అన్నట్టుగా. చాలా సమతౌల్యంగా కేటీఆర్ మాట్లాడారు. టీడీపీకి బలం ఉంది కాబట్టే కాంగ్రెస్ పొత్తుకు ఒప్పుకుందని చెబుతూనే… తెలంగాణలో టీడీపీ అవసరం లేదు కాబట్టే, ఇక్కడి సెటిలర్లు తెరాసకు మద్దతుగా నిలిచారంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల సందర్భంలో తాము చేసే విమర్శల్ని కూడా లైట్ గా తీసుకోవాలన్నారు! అవి సహజం అంటూ సమర్థించుకున్నారు.