తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిసెంబర్ తొలి వారంలో జరిగే పోలింగ్ కోసం… రాజకీయ పార్టీలన్నీ ఆగస్టులోనే అభ్యర్థుల ప్రకటన ప్రారంభిస్తున్నాయి. ఎప్పట్లాగే కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించబోతున్నారు. అంటే…కాంగ్రెస్, బీజేపీలకూ తప్పదు. లేకపోతే వెనుకబడిపోయారనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దరఖాస్తులు తీసుకుంటోంది. బీఆర్ఎస్ రేంజ్ లో కాకపోయినా కనీసం అరవై స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. వచ్చ నెల మొదటి వారంలో అభ్యర్తుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ కూడా అదే పనిలో ఉంది.
2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకున్న కేసీఆర్ భారీగా సన్నాహాలు చేసుకున్నారు. హైదరాబాద్ శివారులో భారీ సభ నిర్వహించారు. తర్వాత గవర్నర్ కు అసెంబ్లీని రద్దు చేస్తూ లెటర్ ఇచ్చిన వెంటనే నేరుగా తెలంగాణ భవన్ కు వచ్చి అభ్యర్థుల జాబితా ప్రకటించారు. ఈ సారి ముందస్తుకు వెళ్లడం లేదు కానీ.. మూడు నెలల ముందుగానే అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. పార్టీలో అసంతృప్తులు ఎవరైనా ఉంటే… ఓ నెలరోజుల్లో సర్దుకుంటారు.. లేకపోతే పార్టీ మారిపోతారు.. ఎన్నికల నాటికి డిస్టర్బెన్స్ ఉండదని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు.
అభ్యర్థులను ప్రకటిస్తే.. ఇక తెలంగాణలో రాజకీయం పూర్తి స్థాయిలో ఎన్నికల మూడ్లోకి వచ్చినట్లే అవుతుంది. రాజకీయ పార్టీల్లోని అసలు రాజకీయాలు అప్పుడే బయటపడతాయి. ఎవరి వ్యూహాలు వర్కవుట్ అవుతాయో ముందు ముందు రాజకీయాలతో స్పష్టమవుతుంది.