తెలంగాణ సీఎం కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ముందస్తుగా ప్రకటించడానికి ఏర్పాట్లు చేసుకుటున్నారు. ఆషాఢ మాసం ముగిసిన తర్వాత జూలై రెండో వారంలో అభ్యర్థులను ప్రకటించి.. పూర్తి స్థాయి ఎన్నికల యుద్ధంలోకి దిగుతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మూడు నెలల ముందుగా అభ్యర్థుల్నిప్రకటించడానికి కేసీఆర్కు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. అసంతృప్త వాదులు చివరి క్షణంలో పార్టీని ఇబ్బంది పెట్టకుండా.. ఉండేవారు ఉంటారు పోయేవారు పోయేలా చేసుకోవడం అందులో ఒకటని చెబుతున్నారు.
కనీసం మూడు నెలల ముందు ప్రకటించడం ద్వారా అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండేలా అవకాశం కల్పించాలనుకుంటున్నారు. లాస్ట్ మినిట్ లో ఎవరైనా వెనుకబడినట్లుగా అనిపిస్తే కొత్త వారికి బీ ఫాం ఇవ్వవొచ్చన్న ప్లాన్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఎవరికి టిక్కెట్లు ఉంటాయో.. ఎవరికి ఉండవో.. కేసీఆర్ ఇచ్చే ప్రాధాన్యం బట్టి వారికి అక్కడి ఎమ్మెల్యేలకు క్లారిటీ వస్తోంది. కేటీఆర్ కూడా… జిల్లాలకు వెళ్లినప్పుడు… టిక్కెట్లు ఎవరికో చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఇరవై మంది ఎమ్మెల్యేలకూ క్లారిటీ ఇచ్చారు. కొంత మందికి ఇవ్వకపోవడంతో అలాంటి వారందరికీ డౌటేనంటున్నారు.
నిజానికి కేసీఆర్ గతంలోలా ఆరు నెలల ముందస్తుకు వెళ్లాలని అనుకున్నారు. దానికి తగ్గట్లుగా అభ్యర్థుల కసరత్తు పూర్తి చేశారు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కాం డెవలప్మెంట్స్ కారణంగా వాయిదా వేశారు. అభ్యర్థులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినందున ఎప్పుడు ప్రకటిస్తారన్నది కీలకంగా మారింది. 2018లో అసెంబ్లీని రద్దు చేసిన రోజే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు కూడా అలా చేయడానికే మొగ్గు చూపుతున్నారు.