“నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతాయి. మూడు రాష్ట్రాల్లో ఒక విడత పోలింగ్ ఉంటుంది, మధ్యప్రదేశ్లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ ఉంటుంది” ఇది.. ఏ ఎన్నికల సంఘం అధికారి చెప్పిందో కాదు. స్వయంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి… కేసీఆర్.. నిన్న ప్రెస్మీట్లో చెప్పిన మాటలు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. పక్కాగా ప్రిపరేషన్ చేసుకుని ఉంటే.. మహా అయితే తెలంగాణ గురించి ప్రకటించవచ్చు కానీ… నవంబర్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలు, అవి ఎన్ని విడతల్లో జరుగుతాయో.. ఎలా చెబుతారు..? అంత పక్కాగా సమాచారం ఆయనకు ఎవరిస్తారు..?
తెలంగాణ ఎన్నికల ప్రక్రియ.. అక్టోబర్లో ప్రారంభమై నవంబర్లో ముగుస్తుందని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత కూడా.. నవంబర్, డిసెంబర్లలో ఎన్నికలు రావని..మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేసీఆర్ తోసి పుచ్చారు. మీడియాలో వస్తున్నంత గందరగోళం లేదని తేల్చేశారు. అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ మొదలై నోటిఫికేషన్ వస్తుంది.. నవంబర్లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు ప్రకటించే అవకాశముందని కేసీఆర్ .. ఎన్నికల ప్రధాన అధికారి తనకు స్పష్టంగా చెప్పినట్లుగా చెప్పుకొచ్చారు. తాను స్వయంగా కేంద్ర ముఖ్య ఎన్నికల అధికారితో, మిగతా ఇద్దరు కమిషనర్లతో మాట్లాడానని కూడా చెప్పుకొచ్చారు. అంటే.. తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయక ముందే.. ఈసీ కూడా.. షెడ్యూల్ రెడీ చేసిందా..?
ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా..స్వతంత్రంగా విధులు నిర్వహించాల్సిన సంస్థ. ఆ సంస్థ పక్కాగా తన విధులు నిర్వహిస్తుందో..ఎన్నికలపైన అంత విశ్వాసం ఉంటుంది. టీఎన్ శేషన్ ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్నప్పుడు.. ఈసీ విలువేంటో అందరికీ తెలిసింది. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు… ఈసీ కంటే ముందే.. ఆయా రాజకీయ పార్టీలు షెడ్యూళ్లు ప్రకటిస్తున్నారు. గతంలో గజరాత్ , కర్ణాటక ఎన్నికల షెడ్యూళ్లను బీజేపీ సోషల్ మీడియా విభాగం ముందుగా ప్రకటించడం వివాదాస్పదమయిది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్.. మిగతా రాష్ట్రాల షెడ్యూళ్లను కూడా ప్రకటించినంత పని చేశారు. మొత్తానిక ముందస్తు విషయంలో తెర వెనుక చాలా గూడుపుఠాణి జరిగిందని మాత్రం క్లారిటిగా తెలుస్తోంది.