కేసీఆర్ ఇమేజ్ వేరు. కేసీఆర్ పార్టీ వేరు. కేసీఆర్ ఆలోచనలు వేరు. వీటన్నంటికీ జాతీయపార్టీ అంటే సరి పడదు.కానీ కేసీఆర్ అన్నింటినీ కాదని అడుగు ముందుకేస్తున్నారు. జాతీయ స్తాయిలో చరిత్ర సృష్టించాలని నిర్ణయించారు. విజయదశమి రోజున ప్రకటిస్తే విజయం చేకూరుతుందన్న నమ్మకంతో ముహుర్తం పెట్టుకుని మరీ పార్టీని ప్రకటిస్తున్నారు. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున మీడయా కవరేజీకి ఏర్పాట్లు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పెట్టించారు. దీనికి రూ. కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు.
ఇక తమ పార్టీకి మద్దతు ప్రకటించడానికి ప్రత్యేక విమానాలు బుక్ చేసి మరీ కొంత మంది నాయకుల్ని పిలిపించారు. కేసీఆర్ జాతీయ పార్టీకి కుమారస్వామి.. ఇతర ప్రాంతీయపార్టీలు మద్దతు పలకడం ఎందుకో చాలా మందికి తెలియదు. కానీ తన పార్టీకి ఇతర రాష్ట్రాల నుంచి ఆహ్వానం ఉందన్న అభిప్రాయం కల్పించడానికి ఆయనీ ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం ఆర్థికపరంగానే కాదు.. ఆయన రాజకీయ పరంగా కూడా ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆ ఖర్చులో తనను ఈ స్థాయికి తీసుకు వచ్చిన టీఆర్ఎస్ కూడా కలిసిపోతోంది.
టీఆర్ఎస్ ను త్యాగం చేసి మరీ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా మారుస్తున్నారు. ఏదైమైనా ముందుకే వెళ్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పట్టించుకోకపోయినా తమ రాష్ట్రం తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని ఆయన అనుకుంటున్నారు. కానీ “సోల్”ను మిస్సయిన పార్టీని ప్రజలు గుర్తు పెట్టుకుంటారా అంటే డౌటే. కానీ కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. ఓ రకంగా కేసీఆర్ అత్యంత కాస్ట్ లీ సాహసం చేస్తున్నారు. అదీ డబ్బు పరంగానే కాదు… రాజకీయ పార్టీ పరంగా కూడా., తేడా వస్తే కేసీఆర్ అన్నీ కోల్పోతారు. విజయం సాధిస్తే మాత్రం చరిత్రలో నిలిచిపోతారు.