రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బెంగళూరులో ప్రకటించారు. దేశంలో ఓ సంచలనం జరగాల్సి ఉందని .. జరుగుతందని ఢిల్లీలో కేజ్రీవాల్‌ను కలిసిన తర్వాత ప్రకటించిన ఆయన బెంగళూరులో … మరో అడుగు ముందుకేసి… రెండు, మూడు నెలల గడువు పెట్టారు. దేశంలో మార్పు రావడం తథ్యమని.. ఈ మార్పును ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. జేడీఎస్ ముఖ్య నేతలు దేవేగౌడ, కుమారస్వామిలతో మాట్లాడేందుకు కేసీఆర్ ప్రత్యేకంగా బెంగళూరు వెళ్లారు. వారితో భేటీ అయ్యారు. కలిసి లంచ్ చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.
ఎందరో ప్రధానులు దేశాన్ని పరిపాలించారని, ఎన్నో ప్రభుత్వాలు రాజ్యాన్ని ఏలాయని.. అయినా.. దేశ పరిస్థితి ఏమాత్రం మారలేదన్నారు. ఒకప్పుడు భారత్ కంటే తక్కువ జీడీపీ వున్న చైనా ఇప్పుడు ఆర్థికంగా ప్రపంచాన్ని శాసిస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల బిజినెస్ అంటూ ప్రచారం చేస్తోందని, ఇది దేశానికే అవమానమని అన్నారు. నిజంగా మనసు పెట్టి అభివృద్ధి చేస్తే.. అమెరికాకంటే ఆర్థికంగా మనమే ఫస్ట్ ప్లేస్‌లో వుంటామని కేసీఆర్ ప్రకటించారు. రోజురోజుకీ పరిస్థితి దిగజారిపోతోందని దేశంలోని ఏ వర్గం కూడా మోదీ పాలనతో సంతోషంగా లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు.
కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ తదితరులున్నారు.జాతీయ స్థాయిలో బీజేపీ యేతర కూటమి ఏర్పాటు దిశగా నేతలు చర్చించారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా బెంగళూరులో కటౌట్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ్‌కి నేత అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. టీఆర్ఎస్ నేతలు ప్రణాళిక ప్రకారం కేసీఆర్‌ను దేశ్ కీ నేతగా ప్రజెంట్ చేస్తున్నారు.