తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లాలా..? వద్దా..? అన్న ధర్మసంకటంలో రెండు రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రమాణ స్వీకార వేడుక భారతీయ జనతాపార్టీ, మోదీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీల బలప్రదర్శన వేదికగా మారడమే దీనికి కారణం. దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కూడా హాజరవుతున్నారు. ఒక వేళ ఈ ప్రమాణస్వీకారానికి హాజరైతే.. రాహుల్‌తో వేదిక పంచుకోవాలి. వెళ్లకపోతే.. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన దేవేగౌడను… అవమానించినట్లవుతుంది. పైగా కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ నేరుగా జేడీఎస్‌కు మద్దతు పలికారు.
ఈ ధర్మసంకటానికి కేసీఆర్ తనదైన శైలిలో… పరిష్కారం కనుగొన్నారు. ఈ రోజే.. బెంగుళూరు వెళ్లి.. కుమారస్వామిని అభినందించి తిరిగి వచ్చేయాలని డిసైడయ్యారు. ప్రమాణస్వీకారానికి తాను ఎందుకు రాలేకపోతున్నానో కుమారస్వామికి కేసీఆర్ వివరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీని వల్ల జేడీఎస్‌తో తాను కొనసాగిస్తున్న స్నేహానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కేసీఆర్ అంచనాకు వచ్చారు. రెండు రోజుల్నుంచి సన్నిహితులతో ఎడతెగని మంతనాలు జరుపుతున్న కేసీఆర్.. ప్రమాణస్వీకారానికి వెళ్లకపోతే.. పూర్తిగా బీజేపీ అనుకూల ముద్రపడుతుందన్న నిర్ణయానికొచ్చారు. ఆ ప్రభావం.. ఫెడరల్ ఫ్రంట్‌పై పడుతుందని అంచనా వేసుకున్నారు. అందుకే .. ప్రమాణస్వీకారానికి వెళ్లకపోయినా.. జేడీఎస్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పడానికి ఒక రోజు ముందే స్వయంగా కేసీఆర్.. బెంగళూరు వెళ్తున్నారు. కుమారస్వామిని అభినందించి తిరిగి వస్తారు.
వచ్చే ఎన్నికల్లో మోదీపై పోరాడటానికి ప్రాంతీయ పార్టీలన్నీ… అప్రకటిత కూటమిగా మారడానికి కుమారస్వామి ప్రమాణస్వీకార సభ వేదికగా మారుతోంది. ఎన్నికలకు ముందు వీరంతా.. విడివిడిగా పోటీ చేసినా.. ఎన్నికల తరవాత పరిస్థితుల్ని బట్టి… మోదీని మళ్లీ ప్రధాని కాకుండా చేయాడనికి కర్ణాటక తరహా ఫార్ములానే ప్రయోగించబోతున్నారన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అందుకే.. కాంగ్రెస్ కన్నా… తాను బీజేపీకే ప్రిఫరెన్స్ ఇస్తానని…కేసీఆర్ తన తాజా నిర్ణయంతో నిరూపించారు.