తన మీద విమర్శలు రాకుండా జాగ్రత్తపడటంలో సీఎం కేసీఆర్ ని మించినవారు లేరు! దానికి తాజా ఉదాహరణ ఆర్టీసీ కార్మికుల సమ్మె. శాపనార్థాలు పెట్టిన వారితోనే పాలాభిషేకాలు చేయించుకున్నారు. వ్యక్తం కాబోతున్న వ్యతిరేకతను వెంటనే సానుకూలతగా మార్చుకోవడంలో ఆయన చాణక్యం వేరు. తాజాగా ఇలాంటి ప్రయత్నమే మరొకటి ప్రారంభించారు! రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని మొన్ననే కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారు కదా! దానికి కొనసాగింపుగా… శాఖలవారీగా కేంద్రం నుంచి రావాల్సిన పన్నులు, కేటాయింపుల లెక్కలు తీయిస్తున్నారు. ఎమ్మెల్యేలంతా ఈ లెక్కలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని చెప్పారట. ఎందుకంటే, త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారు కావడానికి కేంద్రమే కారణమని ముక్త కంఠంతో ఎలుగెత్తాలన్నది కేసీఆర్ వ్యూహం!
నిజానికి, భాజపాని అసెంబ్లీలో నిలదీయడం పెద్ద ప్రశ్నే కాదు. ఎందుకంటే, ఒక్క రాజాసింగ్ మాత్రమే సభలో భాజపా ఎమ్మెల్యే! కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు కదా! కేంద్రమే తెలంగాణను ముంచింది, కేంద్రమే మనల్ని పట్టించుకోవడం లేదంటూ కేసీఆర్ మాట్లాడితే… గడచిన ఆరేళ్లుగా తమరేం చేశారు సార్, ఆర్థిక పరిస్థితి దిగజారడం వెనక తమరి పాత్ర లేదా అంటూ కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నిస్తారు కదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అలా విమర్శిస్తే ఇబ్బంది కదా? అందుకే, ఇక్కడే ఒక సమష్టి సిద్ధాంతాన్ని తెరమీదికి తెస్తోంది తెరాస. దేశవ్యాప్తంగా భాజపా విధానాలపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోందనీ, తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్న కేంద్రాన్ని ప్రశ్నించడంలో కాంగ్రెస్ పార్టీ తమతో కలిసి వస్తుందంటూ కొంతమంది తెరాస ఎమ్మెల్యేలు ఇప్పుడు మాట్లాడుతున్నారు.
అంటే, అసెంబ్లీలో తమకు వంతపాడాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి పరోక్షంగా చెబుతున్నట్టు. కేసీఆర్ అనుమతి లేకుండా… ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని మెచ్చుకునేలా తెరాస నేతలు మాట్లాడలేరు కదా! రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడం వెనక కేంద్రమే కారణం… ఇదొక్కటే బలంగా వినిపించాలన్నది కేసీఆర్ వ్యూహం. ఈ క్రమంలో ఆరేళ్ల పాలనలో ఆర్థిక విజయాలు లేవా అనే చర్చకు తావివ్వకూడదు, అంతే. ఇప్పుడు కాంగ్రెస్ విచక్షణ ఎలా ఉంటుందో చూడాలి. కేసీఆర్ పాలనను బలంగా ప్రశ్నించడానికి ఉన్న ఈ అవకాశాన్ని సమర్థంగా వాడుకుంటుందో…. లేదంటే, తెరాస ట్రాప్ లో పడిపోయి, అసెంబ్లీ సమావేశాల్లో భాజపా మీద విమర్శలకు దిగుతుందో వేచి చూడాలి.