టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ చాలా మాటలు మాట్లాడారు . అందులో ఒకటి త్వరలో మరికొన్ని అద్భుత పథకాలు ప్రవేశ పెట్టబోతున్నానన్నది ఒకటి. ఓ వైపు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టి.. గత ఎన్నికల్లో ఇచ్చినహామీలే అమలుు చేయడం లేదు. రుణమాఫీ చేయలేదు. రైతు బంధు పథకం ఎప్పుడిస్తే ఇప్పుడు తీసుకోవాలన్నట్లుగా మారింది. నిరుద్యోగభృతి సహా అనేక ప్రకటనలకే పరిమితయ్యాయి. మరో వైపు అప్పులకు కట్టాల్సిన వాయిదాల మొత్తం పెరిగింది. ఆదాయం పడిపోయింది. కేంద్రం మిగులు రాష్ట్రం పేరుతో ఇవ్వాల్సిన వాటిలోనూ కోత పెడుతోంది.
గతేడాది లక్షా 80వేలకోట్ల తో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ కరోనా దెబ్బకు మొత్తం తేడా కొట్టేసింది. సర్కార్ ఖజానాకు 50వేలకోట్ల వరకు రావాల్సిన ఆదాయం గండిపడిందని కేసీఆర్ చాలా సార్లు ప్రకటించారు. ఆదాయం సమకూర్చే రిజిస్ట్రిష్లను కరోనా కారణంగా నిలిచిపోవడం…ఆ తర్వాత ధరణి పోర్టల్ తో సర్కారు కొంతకాలం నిలిపివేయడంతో ఆదాయానికి భారిగా గండిపడింది. ఆస్తి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ .10,000 కోట్లు సంపాదించాలని బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకోగా.. సగం కూడా రాలేదు. అయితే ఈ కారణంగా చెప్పి సంక్షేమ పథకాలను ఆపేస్తే ప్రజల్లో ఆగ్రహం వస్తుంది. అందుకే అప్పులు చేసి.. ఎలాగోలా ఉన్న పథకాలను నెట్టుకొస్తున్నారు.
ఇప్పుడు టీఆర్ఎస్ ఎదురీదే పరిస్థితి వచ్చింది. పాత హామీలన్నీ అమలు చేయాల్సిన పరిస్థితి. లేకపోతే… వ్యతిరేకత మరింత పెరుగుతుంది. అందుకే నిరుద్యోగ భృతి అమలు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. అది బడ్జెట్లో ప్రకటించాల్సి ఉంది. ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి ఉంది. వీటన్నింటికి తోడు మరికొన్ని అద్భుత పథకాలంటూ కేసీఆర్ ప్రకటనలు చేస్తున్నారు. చెప్పిన వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మళ్లీ కొత్త పథకాలంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని టీఆర్ఎస్ వర్గాలే అనుకుంటున్నాయి. మరి కేసీఆర్ ఈ విషయంలో ఏ మ్యాజిక్ చేస్తారో చూడాలి..!