నిజమే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టంతా ఇప్పుడు కొత్త భవనాలపైనే ఉంది! కొత్త సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణాలకు ఆయన శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే, అదే రోజు… అంటే, హైదరాబాద్ లో కొత్త భవనాలకు శంకుస్థాపన జరిగిన రోజునే.. మరో కొత్త భవన నిర్మాణానికి కూడా పూజ జరిగింది. ఇది చాలా రహస్యంగా జరిగిన కార్యక్రమం కావడంతో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ కొత్త నిర్మాణమే… కొత్త ఫామ్ హౌస్! ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎర్రవెల్లిలో సొంత ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న దగ్గర్నుంచీ అది వార్తల్లో ఉంటూనే వస్తోంది. విశ్రాంతి కోసం తరచూ అక్కడికి వెళ్తుంటారు కేసీఆర్. ఇప్పుడు కూడా వారానికి కనీసం ఒకరోజైనా అక్కడ గడపుతారు. అవసరం అనుకుంటే, అక్కడికే అధికారులను రప్పించుకుని మరీ కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకున్న సందర్భాలూ ఉన్నాయి. అందుకే, కేసీఆర్ మీద ఫామ్ హౌస్ సీఎం అంటూ విమర్శలు చేస్తూ విపక్షాలు చాలా విమర్శలు చేస్తుంటాయి.
కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో రెండు ఫ్లోర్లతో ఒక చిన్న భవనాన్ని ఎప్పుడో నిర్మించుకున్నారు. ఇప్పుడా భవనం స్థానంలో సరికొత్త భవనం నిర్మించబోతున్నారు. ఇది ఆయన వ్యక్తిగత భవన నిర్మాణమే అయినా.. ఫామ్ హౌస్ కి ఉన్న పాపులారిటీ దృష్ట్యా, కొత్త భవనం ఏ స్థాయిలో ఉండబోతోందో అనే చర్చ తెరాస వర్గాల్లో మొదలైంది. అంతేకాదు, కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి తెలియనివారంటూ ఎవ్వరూ లేరు. అధికారిక నివాసం ప్రగతి భవన్ ను సర్వ హంగులతో నిర్మించుకున్న సంగతి తెలిసిందే. కొత్త అసెంబ్లీ కూడా రాజసం ఉట్టిపడేలా, సంస్కృతికి ప్రతిబింబంగా ఉండాలని కేసీఆర్ అంటున్నారు. ఆ లెక్కన ఎర్రవెల్లిలో కొత్త ఫామ్ హౌస్ నిర్మాణంలో కూడా భారీతనానికే ప్రాధాన్యత ఉంటుంది.
కొత్త భవనం శంకుస్థాపన కార్యక్రమానికి తెరాసకు చెందిన నేతల్ని ఎవ్వర్నీ కేసీఆర్ ఆహ్వానించలేదు. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే పూజా కార్యక్రమం చేపట్టారు. వాస్తవానికి, ఇది వ్యక్తిగత వ్యవహారం కాబట్టి, ఎవర్నీ పిలవాల్సిన అవసరం కూడా కేసీఆర్ కి లేదు. మరి, ఆ నిర్మాణం ఎలా ఉంటుందో చూడాలి.