దుబ్బాకలో చేసిన తప్పును నాగార్జునసాగర్‌లో చేయనని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన తప్పేమిటంటే దుబ్బాకలో ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవడం. దుబ్బాకలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తారని .. చివరి రోజు ఓ సభ నిర్వహిస్తారని అనుకున్నారు. అక్కడ పోటీ హోరాహోరీగా ఉందని ముందస్తుగానే ప్రచారం జరగడంతో కేసీఆర్ కూడా ఓ మాట చెప్పాల్సి ఉంటుందని అనుకున్నారు. కానీ ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న నమ్మకమో… లేకపోతే.. ఇతర కారణాలో కానీ.. వరంగల్ జిల్లాలో వేరే కార్యక్రమం పెట్టుకుని బహిరంగసభలో మాట్లాడారు కానీ.. దుబ్బాకలో మాత్రం ప్రచారం చేయలేదు.
చివరికి ఆ ఎన్నికలో టీఆర్ఎస్ వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయింది. అప్పట్నుంచి టీఆర్ఎస్ పనైపోయిందన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడు సాగర్ ఉపఎన్నిక విషయంలో అలాంటి తప్పిదం చేయకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రచారానికి వస్తానని ప్రకటించారు. దుబ్బాకలో ప్రచారానికి వెళ్లకపోవడం వల్లనే టీఆర్ఎస్ ఓడిపోయిందని.. సాగర్‌లో అలాంటి పరిస్థితి రానివ్వబోమని.. టీఆర్ఎస్ నేతలకు హామీ ఇచ్చారు. తనతో పాటు కేటీఆర్ కూడా ప్రచారం చేస్తారన్నారు. ఎన్నికల ప్రచార ఖర్చు రూ. ఇరవై ఎనిమిది లక్షలను నోముల భగత్‌కు.. కేసీఆర్ బీఫాంతో పాటు అందించారు. అంతే కాదు.. టిక్కెట్ కోసం పోటీప డిన తేరా చిన్నపరెడ్డి, కోటిరెడ్డిలను బుజ్జగించారు.
వారికి ఎమ్మెల్సీ పదవులను ఆఫర్ చేశారు. ఇప్పటికే చిన్నారెడ్డి ఎమ్మెల్సీ. మరో విడత చాన్సిస్తామని హామీ ఇచ్చారు. కోటిరెడ్డికి కొత్తగా ఎమ్మెల్సీ ఇస్తామని బుజ్జగించారు. అందరూ కలిసి పని చేసుకోవాలని చెప్పి పంపేశారు. ప్రచారాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంతో… జరిగిన తప్పుల నుంచి కేసీఆర్ కొత్తగా పాఠాలు నేర్చుకున్నట్లుగానే ఉందని అంటున్నారు. సాగర్‌లో గెలిచి.. తెలంగాణలో రాజకీయ పరిస్థితులేమీ మారలేదని నిరూపించాలని అుకుంటున్నారు.