మాటలతో కొంత వరకూ మాయచెయ్యొచ్చు. ఆ విద్యలో ఎప్పుడో ఆరితేరిపోయాడు కెసీఆర్. అయితే అలాంటి మాయలకు కూడా ఓ హద్దు ఉంటుంది. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే తానే కుర్చీల్లో కూర్చున్నంత సులభంగా ప్రతిసారీ మాటలతో మేజిక్ చేయాలంటే కుదరదు. అప్పుడంటే సీమాంధ్ర నుంచి ఎవరో వచ్చి తెలంగాణాను చంకలో పెట్టుకుని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళతో పోరాడే వీరుడిని నేనే అని చెప్పుకున్నాడు. ఒక రకంగా దళిత నాయకులను అవమానించాడు. అయినప్పటికీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణం కెసీఆర్ అన్న కృతజ్ఙత తెలంగాణా పౌరులకు ఉంది కాబట్టి ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
కానీ ఇప్పుడు రైతుల సమస్యల గురించి కూడా అలాంటి మాటల ఆటలే ఆడతానంటే ఎలా? తెలంగాణా సమాజం ఒప్పుకుంటుంది అని ఎలా అనుకుంటున్నాడు. ఓ వైపు అశ్వమేథయాగం స్టైల్లో అమిత్ షా దూసుకొస్తున్నాడు. తెలంగాణాను లక్ష్యంగా చేసుకున్నాడన్న విషయం అర్థమవుతూనే ఉంది. అయినప్పటికీ కెసీఆర్ మాత్రం నియంతలా వ్యవహరించడం ఆశ్ఛర్యపరుస్తోంది. ఒక రకంగా తన అపజయానికి తానే బాటలు వేసుకుంటున్నట్టుగా ఉంది. మిర్చి రైతుల కష్టాల గురించి తెలంగాణాలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయినప్పటికీ కెసీఆర్ మాత్రం తెలియనట్టుగా నటించాడు. ఇప్పుడు కన్నీటీ ‘మంట’ను ఆర్పలేను గానీ భవిష్యత్లో మాత్రం చలువ పందిళ్ళు వేస్తా అన్నట్టుగా మాటలతో మాయ చేయాలనుకున్నాడు. రైతుల కోపం రెట్టింపయ్యింది. వాళ్ళ స్టైల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కెసీఆర్ రియలైజ్ అయి ఉంటే బాగుండేది. అంతే కానీ ప్రతిపక్షాలపైన, మీడియాపైన అపవాదు వేయాలన్న ప్రయత్నం మాత్రం బాగాలేదు. మిర్చి రైతులకు కెసీఆర్పై మరి కాస్త కోపం పెరగడం తప్ప అలాంటి ప్రయత్నాల వళ్ళ ఒరిగేదేమీ ఉండదు. తెలంగాణాకు కెసీఆర్ చక్రవర్తి కాదు. తెలంగాణా కల్వకుంట్ల కుటంబం జాగీర్ కాదు. ప్రజల ఆగ్రహావేశాలను, ఆవేధనను అర్థం చేసుకుని వాళ్ళ అభిమానం పొందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో కెసీఆర్ ఉన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణాను వ్యతిరేకించిన వాళ్ళకు మంత్రి పదవులిచ్చిన వాళ్ళు…..కోదండరాంలాంటి వాళ్ళను తెలంగాణా ద్రోహులుగా చిత్రీకరించాలన్న ప్రయత్నాలు చేస్తే నమ్మేంత అమాయక స్థితిలో అయితే ప్రజలు లేరు. అలాంటి ‘రాజకీయం’ మాని ఇప్పటికైనా రైతుల సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తే అది కెసీఆర్కే మంచిది. అలా కాకుండా నేను, నా భజన బృందం తప్ప అందరూ తెలంగాణాకు నష్టం చేస్తున్నారు అని మాటలతో మాయచేసి తెలంగాణా సమాజాన్ని నమ్మించాలి అని అనుకుంటే మాత్రం అమిత్ షాకు రెడ్ కార్పెట్ పరిచినట్టే.