తెలంగాణ సీఎం కేసీఆర్ మనసు మార్చుకున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన జాతీయ స్థాయిలో పోరాటానికి సొంత పార్టీ పెట్టాలనే ఆలోచన చేశారు. దాదాపుగా అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీలో పీఆర్వోను పెట్టుకుని ప్రచారాన్ని ఎక్కడిక్కకడ ఘనంగా చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ప్రకటనే తరువాయి అని అనుకున్నారు కానీ కేసీఆర్ మాత్రం చివరిక్షణంలో ఆగిపోయారు. ఇప్పుడు అలాంటి ఆలోచన పూర్తిగా పక్కన పెట్టేశారని.. తెలంగాణలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే మొదటికే మోసం వస్తుందని ఆయన ఓ అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
కేసీఆర్ చాలా కాలంగా తెర వెనుక రాజకీయాలే చేస్తున్నారు ఇటీవల యశ్వంత్ సిన్హా కు మద్దతుగా నిర్వహించిన సభ తప్ప ఆయన బయట కనిపించలేదు. జాతీయ రాజకీయాలపై సీరియస్గా వర్కవుట్ చేస్తున్నారని అయితే అదే సమయంలో రాష్ట్రంలో పట్టు కోల్పోతే దేశంలో ఎవరూ పట్టించుకోరన్న కారణంగా ముందు సొంత ఇంటిని చక్క దిద్దుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎంత ధీమాగా ఉన్నా.. టీఆర్ఎస్ పరిస్థితి మరీ అంత మెరుగ్గా ఏమీ లేదని.. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని.. కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్లు చీలిపోయి తాము గెలుస్తామని టీఆర్ఎస్ వర్గాలు ఇప్పటి వరకూ అంచనా వేస్తున్నాయి. కానీ ప్రజలు మార్పును డిసైడ్ అయితే ఏదో ఓ పార్టీకి గుంపగుత్తగా వేస్తారని ప్రస్తుతం పొలిటికల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ ముందుగా.. అధికారాన్ని నిలబెట్టుకోవడంపై దృష్టి సారించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మరో పదిహేను నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ముందస్తుకు వెళ్తే మరో ఆరు నెలల ముందే రావొచ్చన్న అంచనాలు ఉన్నాయి.