రెండు నెలల కిందట అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్… యాభై రోజుల్లో వంద సభలనే నినాదం వినిపించారు. కానీ ఇప్పటికి మూడు సభలే అయ్యాయి. ఇంకా గట్టిగా ప్రచారానికి అటూఇటుగా.. ఇరవై ఐదు రోజులు మాత్రమే ఉంటుంది. అయినా ఇప్పటికీ.. కేసీఆర్ షెడ్యూల్ ఖరారుకాలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని మాత్రం నిర్ణయించారు. పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంపై కేసీఆర్ రోజువారీగా సమీక్ష జరుపుతున్నారు. రోజుకు కొంతమంది అభ్యర్థులతో నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నారు. ప్రచారం సాగుతున్న తీరును ఆరా తీస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు.
అవసరమైనచోట్ల వివిధ ఏజెన్సీల ద్వారా మెరుపు సర్వేలు చేయిస్తున్నారు. వాటి ఆధారంగా సవరించుకోవాల్సిన లోపాలను అభ్యర్థులు, మంత్రులు, ముఖ్య నేతలకు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దగా అవసరం లేనిచోట్ల సభలు, సమావేశాలు బాగా తగ్గించుకోవాలని సూచించారు. ఇదే ప్రాతిపదికన టీఆర్ఎస్ చీఫ్ ప్రచార సభలు ఖరారు కానున్నాయి. సిద్దిపేట, సిరిసిల్ల, హుజురాబాద్ వంటి 10-15 నియోజక వర్గాల్లో కేసీఆర్ సభలు అక్కర్లేదనే అభిప్రాయం పార్టీ వ్యూహకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే పూర్తయిన హుస్నాబాద్, నిజామాబాద్, నల్లగొండ, వనపర్తిల్లో మళ్లీ సభలుండే అవకాశం లేదు. ఈ నెల పన్నెండున నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత ప్రచారసభలు ప్రారంభమవుతాయి.
కూటమి అభ్యర్థులను ప్రకటించాక కేసీఆర్ సభలు మొదలు కానున్నాయి. స్వల్ప వ్యవధి మేరకు రోజుకు నాలుగైదు సభల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉందని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. పూర్తిగా కేసీఆర్ ప్రచారం హెలికాప్టర్ ద్వారానే సాగనుంది. రోజుకు నాలుగైదు సభల్లో పాల్గొనాలని భావిస్తున్నారు. 24 అసెంబ్లీ స్థానాలున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ చివరి మూడు రోజులు ప్రచారం చేసే అవకాశం ఉంది. ముందుగా చెప్పినట్లుగా కాకుండా.. కేసీఆర్ ప్రచార వ్యూహం మొత్తం మారిపోయింది.