పూర్తిగా జాతీయ రాజకీయాలవైపు చూస్తున్న కేసీఆర్ పార్లమెంట్‌కు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. రెండూ ఒకే సారి వచ్చే అవకాశం లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయం. అయితే ఫలితాలు ఎలా వచ్చినా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ఎంపీగా చేయడం కూడా ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు అంచనాకు వచ్చాయి. కేసీఆర్ ఇప్పటి నుండే కరీంనగర్ ఎంపీ సీటుపై కసరత్తు కూడా చేస్తున్నారని చెబుతున్నారు.
ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఉన్నారు. ఆయనపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. అలాగే తనకు ఎదురుగా నిలిచి కీలక సమయంలో దెబ్బకొట్టిన ఈటెల రాజేందర్ ని నిలువరించడం ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా రాజకీయంగా వారి ప్రాభవం తగ్గించాలని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండుసార్లు కరీంనగర్ ఎంపీగా పనిచేసిన అనుభవంతో పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జాతీయ స్థాయి రాజకీయాల్లో కి వెళ్లాలన్నా…. ఢిల్లీ కేంద్రంగా తన వాయిస్ ని బలంగా వినిపించాలన్నా తిరిగి తనకి , ఇటు పార్టీకి పట్టున్న కరీంనగర్ ఎంపీ స్థానాన్ని గెలవడమే కరెక్ట్ అని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది
కేంద్రంలోని బీజేపీపై అలాగే ప్రధాని మోడీ పై విమర్శలు చేస్తూ మాటలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా కేసీఆర్ మారారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయి లో సిద్ధపడే 2024 ఎన్నికల్లో తనకు సెంటిమెంట్ గా ఉన్న కరీంనగర్ జిల్లా మంచిదని డిసైడయ్యారు. అయితే రాజకీయాలు డైనమిక్‌గా ఉంటాయి. కేసీఆర్ అంత కంటే డైనమిక్‌గా ఉంటారు. నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం కానీ.. ఇప్పటికైతే ఆయన ఎంపీగా కరీంనగర్ స్థానానికే ఓటేస్తున్నట్లుగా తెలుస్తోంది.