బీఆర్ఎస్ చీఫ్ కొద్ది రోజలుగా కామారెడ్డి నుంచి పోటీ చేయాలని అనుకుటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది అందులో నిజం ఉందో లేదో ఎవరికీ తెలియదు. బీఆర్ఎస్ హైకమాండ్ వైపు నుంచి ఎలాంటి స్పందన బయటకు రావడం లేదు. తాజాగా కేటీఆర్ ప్రత్యేకంగా కామారెడ్డిలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అంతే కాదు.. నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నామని.. కేటీఆర్ ప్రకటించారు. రూ.28 కోట్లతో నిర్మించిన ఆరు లేన్ల రహదారి, స్వాగత తోరణం, సెంట్రల్ లైటింగ్, మీడియన్, రోడ్డు డివైడర్లను ప్రారంభించారు. అలాగే పట్టణంలో మున్సిపల్ డిపార్ట్మెంట్ రోడ్లు, స్టేడియం కోసం, అంతర్గత రహదారుల కోసం రూ. 20 కోట్లు మంజూరు చేశారని.. కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మార్చి, కలెక్టర్, ఎస్పీ కార్యలయాలు, మెడికల్ కళాశాల, సువిశాల రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేస్తున్మని కేటీఆర్ తెలిపారు.
ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇటీవలి కాలంలో కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయాలని అంటున్నారు. ఆయన ఊరికే అనరని.. పార్టీ నుంచి సంకేతం వచ్చి ఉంటుందని చెబుతున్నారు. కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నియోజకవర్గం మారాలని కేసీఆర్ అనుకుంటున్నారని.. కానీ అలా మారితే.. నెగెటివ్ ప్రచారాలు జరుగుతాయన్న ఉద్దేశంతో ఆగిపోతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.