తెలంగాణ సీఎం కేసీఆర్ బతికుంటే బలుసాకు అయినా తిని బతకవచ్చని.. ప్రస్తుత మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడుకోవడమే ముఖ్యమని భావిస్తున్నారు. ఆర్థికంగా రాష్ట్రం కుదేలవుతున్నప్పటికీ.. ఆయన ఏ మాత్రం ఆలోచన చేయడం లేదు. ప్రస్తుతం కేసులు అంతకంతకూ పెరుగుతున్నందున.. లాక్డౌన్ కొనసాగింపు మినహా మరో మార్గం లేదని నిర్ణయించుకున్నారు. ప్రెస్మీట్లో ఇదే విషయాన్ని చెప్పిన ఆయన ప్రధానమంత్రికీ అదే చెప్పనున్నారు. మంత్రి వర్గ సమావేశంలోనిర్ణయం తీసుకోబోతున్నారు. శనివారం సాయంత్రం.. ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ పూర్తయిన తర్వాత తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చించి.. లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోనుంది.
లాక్డౌన్ విషయంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు.. ఒకే అభిప్రాయంతో ఉన్నాయి. ఒడిషా, పంజాబ్ రాష్ట్రాలు.. తమ తమ అధికార పరిధిలో ఇప్పటికే.. లాక్ డౌన్ ప్రకటించేశాయి. కేంద్రంతో సంబఁధం లేకుండానే అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. చాలా కొద్ది రాష్ట్రాలు మాత్రం భిన్నాభిప్రాయంతో ఉన్నాయి. కేంద్రం ఆలోచన ఏమిటో స్పష్టత రాలేదు. కానీ కేంద్రం కూడా లాక్ డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపుతోంది. కానీ.. దేశం మొత్తం కాకుండా.. కఠిన నిబంధనలు హాట్ స్పాట్లకే పరిమితం చేసి.. వైరస్ వ్యాప్తి లేని జిల్లాల్లో సడలింపులు ఇవ్వాలని బావిస్తోంది.
వైరస్ ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తి చెందుతున్నందున తెలంగాణ సర్కార్.. ఆ చాన్స్ కూడా తీసుకోవాలని కోరుకోవడం లేదు. నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగిస్తే.. కేసుల సంఖ్య తగ్గుతుందన్న నమ్మకంతో ఉంది. ప్రస్తుతం తబ్లిగీ సభ్యులందర్నీ ట్రేస్ చేసి.. టెస్టులు కూడా పూర్తి చేసినందున… ఇక కొత్త కేసులు రావని నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. రెండు వారాలు కఠినంగా ఉంటే.. పరిస్థితి మెరుగుపడుతుందన్న అంచనాలో ఉన్నారు. ఆర్థిక కష్టాలను ఎలాగోలా తీర్చుకోవచ్చు కానీ… మనుషుల ప్రాణాలు పోతే మాత్రం తీసుకురాలేమని భావిస్తున్నారు. అందుకే.. మరో మాట లేకుండా లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.