లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగించాలనే ఆలోచనలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం అధికారులతో జరిగిన సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. నేడు… ప్రధానమంత్రి మోడీతో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. అందులో.. అందరి ముఖ్యమంత్రులు.. తమ తమ అభిప్రాయాలు వెలిబుచ్చనున్నారు. ప్రధానికి ఏం చెప్పాలన్నదానిపై.. అధికారులు, మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తూండటంపై.. సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా పట్టు విడువలకుండా.. కోరనాను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే వరకూ లాక్ డౌన్ కొనసాగిస్తే.. తెలంగాణ ప్రమాదం నుంచి బయటపడుతుందనే అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారు..
తెలంగాణలో సంపూర్ణ లాక్ డౌన్‌ను కేసీఆర్ మే ఏడో తేదీ వరకు పొడిగించారు. ప్రధానమంత్రి మోడీ మే మూడో తేదీ వరకే లాక్ డౌన్ ప్రకటించారు. ఇరవయ్యో తేదీ నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఆ తర్వాత దుకాణాలు తెరుచుకోవడానికి కూడా కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇచ్చింది. కానీ కేసీఆర్ మాత్రం.. వాటిని అమలు చేయడానికి ఇష్టపడలేదు. తమ విధానం ప్రకారం… రాత్రి పూట కర్ఫ్యూ కొనాసగిస్తున్నారు. ఉదయం పూట లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతూండటంతో… మరింత జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నారు.
హాట్ స్పాట్లు, కంటెన్మెంట్ జోన్ల వారీగా…. ప్రత్యేక జాగ్రత్తలను తెలంగాణ సర్కార్ తీసుకుంటోంది. క్వారంటైన్ సమయాన్ని 28 రోజులకు పెంచింది. 14 రోజుల క్వారంటైన్ పూర్తయి ఇళ్లకు వెళ్లిన తర్వాత 28 రోజులకూ లక్షణాలు బయటపడుతూండటంతో.. ఈ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదన్న భావనలో కేసీఆర్ ఉన్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం ఆలోచనలేమిటో తెలుసుకున్న తర్వాత.. దానికి తగ్గట్లుగా కేసీఆర్ నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.