అదేంటో కానీ గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చేశారో అచ్చంగా కేసీఆర్ కూడా అదే చేస్తున్నారు. బీజేపీతో వైరం.. మోదీపై విమర్శలు.. ఇలా అన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఈవీఎంలపై పోరాటం కూడా కేసీఆర్ చంద్రబాబు తరహాలోనే చేయబోతున్నారు. గత ఎన్నికలకు ముంచు చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ సహా ప్రజాప్రతినిధులంతా ఈవీఎంలపై ఈసీ దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకూ పోరాడారు. కానీ ప్రయోజనం పొందలేకపోయారు.
ఈవీఎంలను మానిప్యులేట్ చేయవచ్చని సాంకేతికంగా నిరూపించేందుకు ప్రయత్నించారు. కానీ అలా నిరూపిస్తామన్న ఓ టీడీపీ నిపుణుడు కేసులు పాలయ్యాడు తప్ప.. వేరే ఏ ప్రయోజనమూ లభించలేదు. ఇప్పుడు కేసీఆర్ మరోసారి ఈవీఎంలపై కాంగ్రెస్తో సహా ఇతర పార్టీల మద్దతుతో పోరాడాలని నిర్ణయించుకున్నారు. న్యాయపరమైన పోరాటామా.. రాజ్యాంగపరమైన పోరాటమా.. రాజకీయ పరమైనదా అన్నది తేలాల్సి ఉంది.
అయితే ఈవీఎంల విషయంలో ఓడిపోయే పార్టీలు మాత్రమే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్న ఓ వాదన బలంగా ఉంది. అదే ఈవీఎంలతో గెలిచిన తర్వాత వాటి గురించి పెద్దగా మాట్లాడటం లేదనే విమర్శలు ఉన్నాయి. మమతా బెనర్జీ కూడా ఘన విజయం సాధించారు. కానీ ఆమె అంతకు ముందు ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ ఈవీఎంలపై పోరాటంతో ఏం సాధిస్తారో వేచి చూడాలి.