జాతీయ పార్టీ ఆలోచనలను పక్కన పెట్టిన కేసీఆర్ ఇప్పుడు పార్టీపై దృష్టి పెట్టారు. పీకే టీం ఇస్తున్న ఫీడ్ బ్యాక్.. పార్టీ నేతలు చెబుతున్న ఫిర్యాదులు… ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్న ఆరోపణలు ఇలా అన్నింటినీ బేరీజు వేసుకుని ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు నడుం బిగించారు. ఇందు కోసం ” ధరణి”పై తొలి సారి దృష్టి సారించారు. తెలంగాణ సర్కార్ భూ సమస్యల పరిష్కారం కోసం అంటూ ధరణిని తీసుకు వచ్చింది. కానీ ఇది భూ సమస్యలను రెండింతలు చేసింది. దీంతో ప్రతీ గ్రామంలోనూ ఏదో ఓ సమస్య ఏర్పడింది. దీని వల్ల లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు.
ఈ సమస్య గురించి రాజకీయ పార్టీలు కూడా చాలా కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్లో ధరణి రద్దు అనేది కూడా ఒకటి. ఈ హామీ చాలా మందిని విశేషంగా ఆకర్షిస్తోందని టీఆర్ఎస్కు ఫీడ్ బ్యాక్ అందుతోంది. ఇది కేసీఆర్ మానసపుత్రిక. వ్యతిరేకంగా ఉన్నారని వెంటనే రద్దు చేయలేని పరిస్థితి. అందుకే ఇందులోని సమస్యలను పరిష్కరించాలని ముందుగా నిర్ణయించారు. అధికారులతో కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అసలు సమస్యలేంటి.. ఎక్కడ ఇబ్బందులున్నాయి.. ప్రజల ఇబ్బందులేంటి అనేదానిపై చర్చించారు. పరిష్కారానికి రోడ్ మ్యాప్ రూపొందించారు.
ధరణి విషయంలోనే కాదు ఇతర అంశాల్లోనూ ప్రజల్లో అసంతృప్తి ఉందని.. వాటిపైనా కేసీఆర్ కసరత్తు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశాలు వరుసగా కొన్ని రోజుల పాటు జరుగుతాయి. ప్రజలకు కొత్త పించన్లు, రేషన్ కార్డులు ఇవ్వడం సహా అనేక అంశాలపై కేసీఆర్ నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీని చక్కదిద్దుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తాజా పరిణామాలతో స్పష్టమవుతోందంటున్నారు.