ప్రభుత్వంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాల్లో ఒకటి అయిన రుణమాఫీ అంశంపై ఓటింగ్ కు ముందు అయినా కాస్త నెగెటివిటీ తగ్గించుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రైతు బంధు నిధులు ఎలాగూ జమ చేయడం లేదని తేలిపోయింది. మిగిలిపోయిన రుణమాఫీ అయినా ఇస్తామని.. ఈసీకి దరఖాస్తు చేశారు. హరీష్ రావు కొద్ది రోజులుగా ఈసీ ఓకే అంటే.. ఇప్పుడే రుణమాఫీ చేస్తామని ప్రకటను చేస్తూ వస్తున్నారు. అలాగే ఉద్యోగులకు డీఏను కూడా ఎన్నికలకు ముందు ప్రకటించారు. కానీ జీవో ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తామని ఈసీకి దరఖాస్తు ఇచ్చారు.
కానీ ఈసీ మాత్రం ఇప్పుడు ఎలా ఇస్తారని నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈసీ అడ్డుకుందని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ కు అవకాశం ఉంటుంది. నిజానికి ఎవరూ ఈ అంశంపై ఫిర్యాదు చేయలేదు. కాంగ్రెస్ వాళ్లు ఫిర్యాదు చేస్తే పెద్ద రచ్చ చేసి ఉండేవారు. అలాంటిదేమీ లేకపోవడంతో ఈసీని విమర్శించి బండి నెట్టుకు రావాల్సి ఉంటుంది. నిజంగా రుణమాఫీ చేయదల్చుకుంటే.. ఎననికల షెడ్యూల్ వచ్చే వరకూ ఎందుకు చేయలేదనే ప్రశ్న సహజంగానే రైతుల్లో వస్తోంది. దానికి ప్రభుత్వం వద్ద సమాధానం ఉండదు. డీఏ విషయంలో ఉద్యోగులదీ అదే వాదన.
2018 ఎన్నికల సమయమంలో పాత పథకం పేరుతో ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే రైతులందరికీ రైతు బంధు చెక్కులు విస్తృతంగా పంచారు. అవి అప్పట్లో బీఆర్ఎస్ విజయానికి దోహదపడ్డాయి. ఇప్పుడు మాత్రం ఓటింగ్ కు ముందు ఎలాంటి డబ్బులు పంపిణీ చేయలేకపోతున్నారు. నిజంగా డబ్బులు ఉండి ఉంటే… కొట్లాడి అయినా పంచే వాళ్లని.. తెలంగాణ సర్కార్ వద్ద నిధుల్లేవన్న వాదన వినిపిస్తోంది.