తెలంగాణ ప్రభుత్వం హరిత హారం కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో నిర్వహిస్తోంది. ఈ ఏడాది 46 కోట్ల మొక్కలను నాటి సంరక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే నాలుగేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటి సంరక్షించాలనేది భారీ సంకల్పం. ఈ లక్ష్యాన్ని సాధిస్తే నిజంగానే రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణ అవుతుంది. అడవులు విస్తీర్ణాన్ని ఇప్పుడున్న 24 శాతం నుంచి 33 శాతానికి పెంచాలనే సంకల్పం కూడా పెద్దదే.
మొక్కలు నాటడం ఏమంత కష్టం కాదు. పైగా మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కడపడితే అక్కడ మొక్కలు నాటే కార్యక్రమాలు జరుగుతాయి. ఫొటోలకు, టీవీ కెమారాలకు పోజులిచ్చి హడావుడి చేయవచ్చు. అంతటితో అయిపోతే ఇక లక్ష్య సాధన అనుమానమే.
నాటిన మొక్కలను సంరక్షించడం ముఖ్యం.
ఇందుకు ఓ ప్రత్యేకమైన విభాగం ఉంది, అందులోని సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తేనే మొక్కలను కాపాడే కార్యక్రమం పక్కాగా జరుగుతుంది. నాటిన నాయకులు, ప్రజలు కూడా ఆ మొక్కలను ప్రాణప్రదంగా సంరక్షించడం బాధ్యతగా భావిస్తేనే ఆకుపచ్చని తెలంగాణ ఆవిష్కృతమవుతుంది.
హైదారబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా ఒకప్పుడు చెట్లుండేవి. ఇప్పుడు వాటి జాడలేదు. రోడ్డు విస్తరణలో వేలాది చెట్లను నరికేశారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకూ 163 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా శుక్రవారం రెండు గంటల్లో లక్షన్నర మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. నిజంగా ఇన్ని మొక్కలను గనక కాపాడగలిగితే, పిల్లలకు పాఠ్య పుస్తకాల్లో పాత విషయాలకు బదులు ఈ అంశాన్నే చేర్చాల్సి ఉంటుంది.
అశోకుడు చెట్లను నాటించెను అని బడి పిల్లల పాఠ్యపుస్తకాల్లో పాఠం ఉంటుంది. ఇప్పటికీ అశోకుడి పేరును ఘనంగా తలచుకోవడానికి కారణం, చెట్ల పెంపకం. నిజంగా తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన ప్రకారం మొక్కల సంరక్షణ జరిగితే, కొన్నాళ్లకు ఆ చెట్లు ఏపుగా పెరిగితే సర్కారు ఖ్యాతి, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతాయి.